తెలంగాణలో కొత్త రెవెన్యూ విధానం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ ప్రారంభ తేదీ మారింది. దసరా నాడు పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని కారణాలతో ఈనెల 29కి వాయిదా పడింది. 29న మధ్యాహ్నం పన్నెండున్నరకు ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ధరణి పోర్టల్ ద్వారానే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తిరిగి మొదలుకానుంది. వ్యవసాయ ఆస్తులకు తహసీల్దార్లు, వ్యవసాయేతర ఆస్తులకు సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.