Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
Coronavirus: స్కూల్స్, హాస్టళ్లలో భారీగా కేసులు నమోదు * కరోనాకు హాట్ స్పాట్స్‌గా మారుతున్న స్కూల్స్
Coronavirus: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ భయకరంగా వ్యాప్తి చెందుతోంది. ఐదారు నెలలపాటు తగ్గినట్టే తగ్గిన కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు తెరుచుకోవడం, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో మహమ్మారి మరోమారు పడగ విప్పుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాలను వణికిస్తున్న వైరస్.. తెలంగాణపై కూడా ప్రతాపం చూపిస్తోంది.
విద్యాసంస్థలు, హాస్టళ్లలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్క ప్రకారమే ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు కరోనాబారినపడ్డారు. వీరితోపాటు సాధారణ ప్రజలు కూడా వైరస్ బారినపడుతున్నారు. అయితే ఈసారి వైరస్ సోకిన ఎక్కవ మందిలో కనీస లక్షణాలు కన్పించడం లేదు. వైరస్ బలహీన పడటమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరి నుంచి మరొకరికి తెలియకుండానే వేగంగా వ్యాపిస్తోంది.
ఇదిలా ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లు మూసి వేయాలని.. సాధారణ పరిస్థితులు నెలకొనే దాకా పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు తరగతులను నిలిపివేయాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. అయితే రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని చెబుతున్నారు. ఇక పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం అప్రమత్తం అయిందని తెలిపారు. అదేవిధంగా కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.