Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

Update: 2025-01-06 00:33 GMT

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నెహ్రూ జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఆరులేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4గంటలకు ప్రారంభించనున్నారు. ఎస్ ఆర్ డి.పి ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ఫ్లైఓవర్లలో ఇది కూడా ఒకటి.

హైదరాబాద్ నగరంలో పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపొడవైన ఫ్లైఓవర్ గా ఇది నిలవనుంది. రూ. 736కోట్ల అంచనా వ్యయంతో సుమారు 4 కిలోమీటర్ల పై బడిన పొడవు గల 6 లేన్ల ఫ్లైఓవర్ ను చేపట్టారు. ప్రధాన ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యినందున సీఎం రేవంత్ రెడ్డి జనవరి 6 సోమవారం ప్రారంభించనున్నారు. ఇంతకుముందు బైరమల్ గూడ సెకండ్ లెవల్ ఫ్లైఓవర్ ను సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎస్ ఆర్ డి.పి ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన 42 పనుల్లో ఇప్పటి వరకు 36 పనులు పూర్తయ్యాయి.


సికింద్రాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లా, హుజురాబాద్, భువనగిరి, మేడ్చల్ , మల్కాజ్ గిరి వాసులకు శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు అక్కడి నుంచి తిరుగుప్రయాణంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణాకు వెసులుబాటు కల్గుతుంది. ఉప్పల్ నుంచి నాగోల్, కామినేని, ఎల్బినగర్ జంక్షన్ , బైరమల్ గూడ, అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ , చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా నిర్దేశించిన సమయంలో చేరవలసిన గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు తక్కువ ఇంధన వాడకం, కాలుష్య రహితంగా వెళ్లేందుకు వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేందుకు ఈ ఫ్లైఓవర్లు ఎంతగానో దోహదపడే అవకాశం ఉంది.

ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుంచే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు ఇతర వాహనాలు రోజుకు 1700నుంచి 2000 వరకు రోజు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లేందుకు ఆరు లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ 4 లైన్ల ఫ్లైఓవర్ కాగా ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ఆర్ లైన్లతో 4 కిలోమీటర్ల పైగా పొడవుతో చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన అతిపెద్ద ఫ్లైఓవర్ గా నిలుస్తుంది.

ఈ నేపథ్యంలో నెహ్రూ జూ పార్క్-ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రధాన ఫ్లైఓవర్ ను ప్రారంభించడంతో వాహనదారులకు సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన మిగతా పనులు ఇరువైపులా ర్యాంపులు, సర్వీస్ రోడ్డు వచ్చే మార్చి 2025 లోపు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్ ఆర్ డీపీ ద్వారా చేపట్టిన 42 పనుల్లో 22 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్ లు, 6 ఆర్ ఓ బిలు మరో మూడు పలు రకాల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. 

Tags:    

Similar News