Ippa Puvvu Laddu: గర్భిణీ స్త్రీల ఆహార డైట్ లో ఇప్పపూవ్వు లడ్డూ

Ippa Puvvu Laddu: ఇప్పపువ్వు అనగానే మనిషికి మత్తెక్కించే గుడుంబా తయారీలో వాడుతారనుకుంటారు.

Update: 2022-05-02 15:30 GMT

Ippa Puvvu Laddu: గర్భిణీ స్త్రీల ఆహార డైట్ లో ఇప్పపూవ్వు లడ్డూ

Ippa Puvvu Laddu: ఇప్పపువ్వు అనగానే మనిషికి మత్తెక్కించే గుడుంబా తయారీలో వాడుతారనుకుంటారు. కానీ దాన్ని వాడుకోవడం ఎలాగో తెలిస్తే తల్లిని మించిన సేవ చేస్తుందని నిరూపిస్తున్నారు ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డలు. ఇప్పపువ్వుతో లడ్డూలు తయారు చేసి ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇప్పపువ్వును ఇంకా ఎన్ని విధాలుగా వాళ్లు వాడుతున్నారో తెలియాలంటే ఆదిలాబాద్ ఏజెన్సీకి వెళ్లాల్సిందే.

మధురాతిమధురమైన ఇప్పపువ్వు లడ్డూలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్నారు. లడ్డూల తయారీ కోసం ముందుగా ఇప్పపువ్వును సేకరిస్తారు. సేకరించిన ఇప్పపువ్వును ఆరుబయట ఆరబెడతారు. ఆ తర్వాత నూనెలో వేయిస్తారు. నువ్వులు, పల్లీలను దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు జీడిపప్పు, యాలకులు, మిరియాలపొడి కలిపి లడ్డూలు తయారు చేస్తున్నారు.

ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిలో భాగంగా భీంబాయ్ ఆదివాసీ మహిళా సంఘంపేరిట రెండేళ్ల క్రితం ఉట్నూర్ సమీపంలోని క్రాస్ రోడ్డువద్ద ఉన్న ITDA ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఓ షెడ్డు తీసుకొని ఇప్పపువ్వు లడ్డూల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట్లో వ్యాపారం అంతగా నడవలేదు. అయినా వారు నిరాశ చెందలేదు. ITDA అధికారుల సహాయంతో లడ్డూలను జీసీసీ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ లడ్డూల్లో మంచి పోషకాహార పదార్థాలు ఉన్నాయని నిర్ధారించడంతో గిరిజన గూడేల్లో రక్త హీనతతో బాధపడే గర్భిణులు, పిల్లలకు అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఏజెన్సీలోని జైనూర్, ఉట్నూర్ మండలాల్లోని 200 మంది గర్భిణులకు గత ఆరు నెలలుగా ఇప్పపువ్వు లడ్డూ రోజుకొకటి చొప్పున ఇస్తున్నారు. దీంతో ఆ మహిళల్లో హిమోగ్లోబిన్ పెరిగి మంచి రిజల్ట్స్ వచ్చాయి.

వీరు తయారు చేస్తున్న లడ్డూల్లో కృత్రిమ రసాయనాలు అస్సలు ఉండవు. రుచికి రుచి.. ఆరోగ్యం అదనం. ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల తమకు అలసట కూడా త్వరగా రావడం లేదని గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పపువ్వు లడ్డూల్లో క్యాల్షియం, నైట్రోజన్ వంటి పోషక పదార్థాలు అధికంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో గర్భిణులకు ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు. ఈ లడ్డూలసు గిరాకీ పెరగడంతో నిర్వాహకులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. స్వయంశక్తితో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకుంటూ ఆర్థికంగా బలోపేతమౌతూ ఇతరులకు ఆదర్శనంగా నిలుస్తున్నారు.

Full View


Tags:    

Similar News