Medical Colleges: తెలంగాణలో అందుబాటులోకి మరో 9 మెడికల్ కాలేజీలు

Medical Colleges: ఒకే వేదికపై నుంచి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Update: 2023-08-13 08:15 GMT
9 More Medical Colleges Are Going Available In Telangana

Medical Colleges: తెలంగాణలో అందుబాటులోకి మరో 9 మెడికల్ కాలేజీలు 

  • whatsapp icon

Medical Colleges: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్‌ వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఒకే వేదికపై సీఎం వీటిని ప్రారంభిస్తారని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆసిఫాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌, జనగాం, సిరిసిల్ల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కాలేజీలో వంద ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే కాళోజీ హెల్త్‌యూనివర్సిటీ ఈ ఏడాది వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికానుంది. సెప్టెంబరు మొదటి వారం నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు మొదలుకానున్నాయి.

2014లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేవి. గతేడాది వరకు వాటి సంఖ్య 2వేల 890కు పెరిగింది. కొత్తగా అందుబాటులోకి రానున్న తొమ్మిది కాలేజీలతో మరో 900 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ వైద్యవిద్య కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 3వేల 790కు చేరకుంది. ప్రభుత్వ, ప్రైవేటు మొత్తంగా చూస్తే, 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్‌ కాలేజీలు ఉంటే, ఈ ఏడాది వాటి సంఖ్య 56కు చేరుకుంది. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2వేల 850 నుంచి 8వేల 340కు పెరిగింది.

కాగా, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ద్వారా వచ్చే ఏడాదిలో మరికొన్ని సీట్లు వస్తాయి. దీంతో మొత్తంగా పదివేల ఎంబీబీఎస్‌ సీట్లు తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 7.5పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు వల్ల తెలంగాణ విద్యార్థులకు డాక్టర్‌ చదువు మరింత చేరువైందని ప్రభుత్వం చెబుతోంది.

వచ్చే ఏడాది గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్‌, మెదక్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఒక్కొ కాలేజీలో వంద సీట్ల చొప్పున 800 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ కాలేజీల్లో మొత్తం 4వేల590సీట్లు అందుబాటులోకి వస్తాయి.

Tags:    

Similar News