Top-6 News of the Day: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్ నియామకం: మరో 5 ముఖ్యాంశాలు
Top-6 News of the Day, 30 July 2024: వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి 84 మంది మృతి: మరో 5 ముఖ్యాంశాలు
Top-6 News of the Day (30/07/2024)
1. వయనాడ్ మెప్పాడిలో కొండచరియలు విరిగిపడి 84 మంది మృతి
వయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడి 84 మంది మృతి చెందారు. మరో 116 మంది గాయపడ్డారు. 250 మందిని రక్షించి తాత్కాలిక షెల్టర్లలోకి తరలించారు. కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, ఎన్ డీ ఆర్ ఎఫ్ తో పాటు ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కొండచరియల కింద పలువురు చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రాంతంలో గత 24 గంటల్లో 372 మి.మీ.వర్షపాతం నమోదైంది. ఈ ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
2. బీఆర్ఎస్ లో తిరిగి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ లో తిరిగి చేరారు. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. హస్తం పార్టీలో చేరిన 23 రోజుల తర్వాత ఆయన ఆ పార్టీని వీడారు. ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. పార్టీలో చేరాలని ఆయనను కేటీఆర్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు కృష్ణమోహన్ రెడ్డి తిరిగి గులాబీ కండువా కప్పుకున్నారు.
3. అమెరికాలో అమితాబ్ బచ్చన్ విగ్రహం
అమితాబ్ బచ్చన్ విగ్రహాన్ని అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన గోపిసేథ్ అనే వ్యాపారి ఏర్పాటు చేశారు. విగ్రహాం ఏర్పాటు చేసి తనకు ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ సంస్థ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించింది. దీంతో ఈ విగ్రహం చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.
4. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అటవీశాఖ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఎవరైనా అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించవద్దని ఆయన అటవీశాఖ ఉద్యోగులకు సూచించారు. పల్నాడు జిల్లాలో అటవీశాఖ ఉద్యోగులపై దాడిని ఆయన ఖండించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆయన మాట్లాడారు.
5. రైతులకు రూ. లక్షన్నర రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్
ఇచ్చిన మాట ప్రకారంగా ఈ నెలాఖరుకు రూ. లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో రెండోవిడత రైతు రుణ మాఫీ కింద రూ. 6,190 కోట్లు మాఫీ చేశారు. 6.4 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ. 6,035 కోట్ల నిధులను విడుదల చేశారు. రెండు విడతల్లో 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్లు జమ చేశారు.
6. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా మదన్ భీమ్ రావు లోకూర్
జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్ ను విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకవతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని నియమించారు. కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఛైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో నరసింహారెడ్డి స్థానం లోకూర్ ను ప్రభుత్వం నియమించింది.