Top-6 News of the Day: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణకు సిద్దమా హరీష్ కు రేవంత్ సవాల్: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణకు సిద్దమా హరీష్ కు రేవంత్ సవాల్: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-27 12:41 GMT

Top-6 News of the Day: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణకు సిద్దమా హరీష్ కు రేవంత్ సవాల్: మరో 5 ముఖ్యాంశాలు

1 గొర్రెల పంపిణీ సహా ఇతర పథకాల్లో అవినీతిపై విచారణకు సిద్దమా?: రేవంత్ రెడ్డి

కేసీఆర్ సర్కార్ చేపట్టిన పలు పథకాల్లో అనేక అవినీతి జరిగిందని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. గొర్రెల పంపిణీ పథకంలో ఏసీబీ అధికారులు పైపైన లెక్కలు తీస్తేనే రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7 వేల కోట్లకు అమ్మారన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములను విక్రయించారని..కానీ, ఆ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. బతుకమ్మ చీరెలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలు చెప్పారని విపక్ష ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు.


2. గోదావరిలో పెరిగిన వరద ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. గోదావరి పరివాహాక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం నుంచి ఇప్పటివరకు 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదలచేశారు.


3. నీతి ఆయోగ్ సమావేశం నుంచి ప.బెంగాల్ సీఎం మమత వాకౌట్

మమత బెనర్జీ దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి తాను మాట్లాడుతున్న సమయంలో తన మైక్ ను ఆఫ్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆమె నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తమ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారన్నారు. అయితే మమత బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. బెంగాల్ సీఎం మాట్లాడే సమయంలో మైక్ ఆఫ్ చేయలేదన్నారు.


4 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ: కమలా హారిస్

అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించిన ధరఖాస్తు పత్రాలపై ఆమె సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే పార్టీలో ముఖ్యమైన నాయకులు, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా తదితరులు ఆమెకు మద్దతు ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో అధ్యక్ష పదవి రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. కమలాకు ఆయన తన మద్దతును ప్రకటించారు. ఇదిలా ఉంటే హారిస్ పై ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. అత్యంత వామపక్ష డెమోక్రట్ల సెనేటర్ జాబితాలో ఆమె ఉంటారని ట్రంప్ చెప్పారు. ఆమె గెలిస్తే దేశంలో వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తారన్నారు.


5. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్

కేంద్ర బడ్జెట్ 2024-25 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.50,474 కోట్లు కేటాయించినట్టుగా కేంద్ర సమాచారశాఖ మంత్రి మురుగన్ చెప్పారు. అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో రొయ్యల ఎగుమతిలో 60 శాతం ఏపీ నుంచే ఉందన్నారు.


6. వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రికార్డు

వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ రికార్డు సృష్టించింది. 1990 నుంచి ఇప్పటివరకు వంద మిలియన్ టన్నుల స్టీల్ ను ఉత్పత్తి చేసి ఈ రికార్డ్ సాధించినట్టుగా యాజమాన్యం తెలిపింది. ముడిసరుకు కొరత కారణంగా 2,3 బ్లాక్ ఫర్నేస్ లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ఏడాది 7. 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది.

Tags:    

Similar News