Top-6 News of the Day: ఏపీ అప్పులు రూ.9.74 లక్షల కోట్లు: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: ఏపీ అప్పులు రూ.9.74 లక్షల కోట్లు: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-26 12:39 GMT

Top-6 News of the Day: ఏపీ అప్పులు రూ.9.74 లక్షల కోట్లు: మరో 5 ముఖ్యాంశాలు

1. జగన్ పాలనలో ఆర్ధిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేత పత్రం

వైఎస్ జగన్ పాలనలో ఆర్ధిక పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షలకు చేరాయని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు సాగు నీరు అంది ఉండేదన్నారు. పట్టిసీమ పూర్తి చేయడంతో రూ. 44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు. అమరావతి అభివృద్ది కొనసాగితే రూ. 3 లక్షల కోట్ల ఆస్తితో పాటు 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు చెప్పారు.


2. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మక్బూల్ మృతి

సయ్యద్ మక్బూల్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందారు. అనారోగ్యంతో నెల రోజుల క్రితం ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దిల్లీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు ఆజం ఘోరికి మక్బూల్ అత్యంత సన్నిహితుడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై కేసులున్నాయి. హైద్రాబాద్ లో నమోదైన కేసులకు సంబంధించి ట్రాన్సిట్ వారంట్ పై ఆయనను దిల్లీ నుంచి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.


3. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జలాశయాలను ఆగస్టు రెండు లోపుగా నింపాలి: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను ఆగస్టు రెండులోపుగా నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. లేకపోతే రైతులతో కలిసి తామే పంప్ హౌస్ లను ఆన్ చేస్తామని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.


4. కార్గిల్ విజయ్ దివస్ రోజున పాక్ కు మోదీ వార్నింగ్

కార్గిల్ విజయ్ దివస్ 25 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం లద్దాఖ్ ద్రాస్ లోని కార్గిల్ మెమోరియల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఆర్మీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పాకిస్తాన్ గతంలో చేసిన అనేక కార్యక్రమాలు విఫలమయ్యాయన్నారు. ఉగ్రవాదులను తయారు చేస్తున్న ఆ దేశానికి తాను మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయని మోదీ చెప్పారు. కుట్రలు ఎప్పటికీ ఫలించవన్నారు. ఉగ్రవాదాన్ని తమ దళాలు అణచివేస్తాయని ప్రధాని ధీమాను వ్యక్తం చేశారు.


5. కమలా హారిస్ కు ఒబామా దంపతుల మద్దతు

అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్ పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం సాగుతోంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. కమలాతో ఒబామా దంపతులు ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒబామా ప్రకటించారు. గత వారంలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. కమలా హారిస్ కు ఆయన తన మద్దతు ప్రకటించారు.


6. అప్పులపై చంద్రబాబు సర్కార్ తప్పుడు ప్రచారం: జగన్

ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్ల అప్పులున్నాయని చెబుతూ సూపర్ సిక్స్ హామీలిచ్చారని టీడీపీ కూటమిపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పులు రూ. 10 లక్షల కోట్లుగా ఎలా అయిందని ఆయన ప్రశ్నించారు. తమ ఐదేళ్ల పాలనలో విద్యుత్ ఒప్పందాలు, గ్యారెంటీలను కలిపినా మొత్తం అప్పులు రూ. 7 లక్షల 48 వేల కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు.పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే ఎన్నికల హామీలకు కేటాయింపులు చూపాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News