Top-6 News of the Day: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా: మరో 5 ముఖ్యాంశాలు
Top-6 News of the Day: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా: మరో 5 ముఖ్యాంశాలు
1. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు భార్య వాణి నిరసన
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా సాగింది. ఆయన భార్య వాణి, కూతురు హైందవిలు శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ , వాణి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శనివారం కూడా వాణి ఆందోళనకు దిగారు. మాధురి కూడా వాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2. వయనాడ్ లో బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన చూరల్మలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పరిశీలించారు. బెయిలీ బ్రిడ్జిని కూడా ఆయన చూశారు. అనంతరం ఆయన మెప్పాడిలోని ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వయనాడ్ కలెక్టర్లతో పీఎం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఈ ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది జూలై 30న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.
3.బంగ్లాదేశ్ లో మరోసారి చెలరేగిన అల్లర్లు
బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు ఆందోళనకు దిగారు. న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ సమావేశం నిర్వహిస్తున్నారనే విషయం తెలియగానే నిరసనకారులు ఆందోళనకు దిగారు. తాత్కాలిక ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ సమావేశం నిర్వహించడంపై నిరసన చేశారు. సుప్రీంకోర్టు ఎదుట నిరసనకారులు ఆందోళనకు దిగడంతో రాజీనామా చేస్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు.
4.కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది: బండి సంజయ్
కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. శనివారం హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇతర పార్టీలను చీల్చి ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన చెప్పారు. కవితకు బెయిల్ విషయం బీజేపీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో తనతో పాటు అనేక మంది బీజేపీ కార్యకర్తలను హింసించారన్నారు.
5. బ్రెజిల్ లో విమానం కూలి 62 మంది మృతి
బ్రెజిల్ లోని సావోపాలో విమానం కూలి 62 మంది మృతి చెందారు. విన్హెడో లో నివాస ప్రాంతంలో వో పాస్ విమానయాన సంస్థకు చెందిన విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 62 మంది మరణించారు. ఈ విమానంలో నలుగురు సిబ్బందితో పాటు 58 మంది ప్రయాణీకులున్నారని విమానాశ్రయ అధికారులు చెప్పారు.
6. ఐతవోలు స్కూల్ కు కల్కి డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ఆర్ధికసాయం
కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ తన స్వగ్రామం ఐతోలులోని ప్రభుత్వ స్కూల్ లో అదనపు గదులకు ఆర్ధిక సాయం చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూ్ల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు ఆయన స్వంత గ్రామం. నాగ్ ఆశ్విన్ ఆర్ధిక సాయంతో అదనపు తరగతి గదులను నిర్మించారు. వీటిని శనివారం ఆయన ప్రారంభించారు.