The big encounters in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఆ ఎంకౌంటర్లు మర్చిపోలేనివి!

The big encounters in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న కొన్ని ముఖ్య ఎన్కౌంటర్ లు ఇవే.

Update: 2020-07-11 18:00 GMT

ఎన్ కౌంటర్ అనగానే అంతా ఉలిక్కిపడతారు. కారణం ఏదైనా ఒక వ్యక్తిని కాల్చి చంపారు అనగానే వామ్మో అనుకోవడం పరిపాటి. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. శుక్రవారం ఉత్తర ప్రదేశ్ కు చెందిన కరడు కట్టిన నేరస్థుడు వికాస్ దుబే ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మామూలుగానే తప్పించుకుని పారిపోతుంటే అడ్డుకున్నాం..మా మీద దాడి చేశాడు.. కాల్చాల్సి వచ్చింది అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక సాధారణంగా ఎన్కౌంటర్ అంటే బోలెడంత గొడవ ఉంటుంది. ప్రజలు కూడా పోలీసులను తప్పుపడుతూ వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ, వికాస్ దుబే ను పోలీసులు కాల్చి చంపితే.. దానికి జనం నీరాజనం పట్టారు. పూల వర్షంతో ఆ పోలీసులకు స్వాగతం పలికారు. ఇది పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో  కూడా ఇటువంటి సంచలనం కలిగించిన ఎన్కౌంటర్ లు చాలానే జరిగాయి. ఎటూ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తెలుగు రాష్ట్రాల్లో  జరిగిన కొన్ని ముఖ్యమైన ఎన్కౌంటర్ ల గురించి ఓసారి మననం చేసుకుందాం.

అసలు దక్షిణాదిలో జరిగిన మొదటి ఎన్కౌంటర్ ఎవరిదో తెలుసా? అది ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. 1924 లో విప్లవ వీరుడు.. స్వాతంత్ర పోరాట ధీరుడు అల్లూరి సీతారామరాజును అప్పటి బ్రిటిష్ పోలీసులు పట్టుకుని కాల్చి చంపారు. ఇదే దాదాపుగా అందరికీ తెలిసిన ఎన్కౌంటర్. 

తెలంగాణా రైతు పోరాటం..

1946 - 1951 మధ్య కాలంలో మూడు వేలకు పైగా ప్రజలను ఎన్కౌంటర్ చేశారు. దానికి కారణం అప్పట్లో జరిగిన తెలంగాణా రైతు పోరాటం.ఎన్కౌంటర్ లలో ఇది ప్రత్యేకమైనది. ఎందుకంటే, చరిత్రలో మొదటిసారిగా తమ ప్రజలను తామే ఎన్కౌంటర్ చేయడం స్వతంత్రం వచ్చాకా మన  రాష్ట్రంలోనే జరిగింది. 

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ 

ఇటీవల కాలంలో చూసుకుంటే.. తెలంగాణలో 2016 ఆగస్టు 9 న జరిగిన ఎన్కౌంటర్ ప్రధానమైనది. పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేసిన గ్యాంగ్ స్టర్ మహమ్మద్ నయీముద్దీన్ ను షాద్ నగర్ పట్టణం లో జాతీయరహదారి 44 పై పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్ నగర్ లోని మిలినీయం సొసైటీలో నయీం ఉన్నడనే సమాచారం అందుకున్న పోలీసులు అతనిని పట్టుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో అతని గన్ మెన్ పోలీసులపై కాల్పులు జరిపాడు. దానితో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నయీం ప్రాణాలు విడిచాడు. అప్పటి తెలంగాణా డీఐజీ అనురాగ్ శర్మ చెప్పిన వివరాలివి. 

వరంగల్ యాసిడ్ దాడి నిందితులు..

తొలిసారిగా ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసులను ప్రజలు అభినందించారు. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ లో మరణించిన నిందితులు పాల్పడిన దుశ్చర్య అటువంటిది. ప్రజల్లో విపరీతమైన కోపాన్ని రగిల్చిన నేరం చేశారా నిందితులు. వరంగల్ పోలీసులు 2008 లో ముగ్గురు నిందితులను కాల్చి చంపారు. ఈ నిందితులు ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధుల మీద యాసిడ్ తో దాడి చేశారు. కారణం వారి ప్రేమను అందులో o యువతి అంగీకరించకపోవడమే. దీంతో ఆ నిందితులు ఆ విద్యార్థితో పాటు, ఆమె స్నేహితురాలిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనపై ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. ఇక ఈ నిందితులను కోర్టుకు తీసుకువెళుతున్న సమయంలో వారు పోలీసులపై దాడికి ప్రయత్నించారానీ, ఆత్మరక్షణ కోసం వారిని హతమార్చామనీ పోలీసులు చెప్పారు. ఇది ఎంత వరకో నిజం అనేది పక్కన పెడితే ఈ ఘటనలో ప్రజలు పోలీసుల పక్షాన నిలబడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో వరంగల్ పోలీస్ సూపరిండెంట్ గా ఉన వీసీ సజ్జనార్ ను హీరోగా చూశారు ప్రజలు.

హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఎన్కౌంటర్..

గత నవంబర్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఎన్కౌంటర్. ఒక యువతిని అపహరించి, దారుణంగా చెరచి సజీవంగా కాల్చి చంపారు. ఈవార్త దావానలంలా దేశం అంతా పాకిపోయింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారి 44 వద్ద ఆ యువతి సగం కాలిన స్థితిలో మృతదేహం దొరికింది. నిందితులను సీన్ రీకన్స్త్రక్ట్ కోసం స్పాట్ కి తీసుకువెళ్ళారు పోలీసులు. అక్కడ వారు పోలీసులపై దాడికి దిగారు. దీంతో మరో మార్గం లేక వారిని కాల్చి చంపారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్ విషయంలో కూడా పోలీసులకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఈ ఘటనలోనూ వీసీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. దీంతో అయన సూపర్ హీరోగా ప్రజల నుంచి మన్ననలు పొందారు. వరంగల్ ఘటనను అందరూ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 

 







Tags:    

Similar News