Makar Sankranti 2025: భోగిభాగ్యాల సంక్రాంతి.. పండగ షూరూ చేసిన పల్లెపట్టణం..!

Makar Sankranti 2025: సంక్రాంతి పండుగంటే కల్లలెరుగని పల్లె సంబరం.. పట్టణాలన్నీ పల్లెలకు పయనమయ్యే సంతోషకరమైన రోజు.

Update: 2025-01-13 02:29 GMT

Makar Sankranti 2025: భోగిభాగ్యాల సంక్రాంతి.. పండగ షూరూ చేసిన పల్లెపట్టణం..!

Makar Sankranti 2025: సంక్రాంతి పండుగంటే కల్లలెరుగని పల్లె సంబరం.. పట్టణాలన్నీ పల్లెలకు పయనమయ్యే సంతోషకరమైన రోజు.. పెట్రోల్ మురికి లేని పచ్చని పైరగాలిని ఆస్వాదించే శుభతరుణం. పాడి పంటలంటే ఏంటో కళ్లారా చూసే శలవు దినాలు.. సంక్రాంతి తమ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని రైతులు, తమ సౌభాగ్యాన్ని కాపాడాలని మగువలు భావిస్తారు. చిన్న పిల్లలు పతంగులతో పోటీ పడుతున్నారు. సంప్రదాయ పద్దతులకు జీవం పోస్తూ హరిదాసులు... బసవన్నలతో గంగిరెడ్ల వాళ్లు చేసే సందడి.. సంక్రాంతి స్పెషల్‌పై ప్రత్యేక కథనం.

సంక్రాంతి అంటే పల్లె లోగిళ్లన్నీ ముచ్చటైన ముగ్గులతో..... మగువల ముచ్చట్లతో మురిసిపోతాయి. పండు వెన్నెల ముంగిట్లో పిండార బోసినట్లు పట్టపగలే వచ్చి వాలిందేమో అనిపించే ముగ్గులు మౌనంగా సడిచేస్తాయి. రంగు రంగుల పరికీణలతో రంగవల్లులు తీర్చిదిద్దే అతివల మునివేళ్లను తాకిన పిండి బొమ్మలు, మంచుతడిలో మురిసి పోతాయి.


తెలిమంచు మేలిముసుగును తొలగించుకొని అప్పుడప్పుడే విచ్చుకుంటున్న వెలుగు రేఖలు ...ఆ భానుడి లేలేత కిరణాలతో పోటీపడుతూ పొలాలకు పరుగులు తీసే ఎడ్లబళ్లు..... లయబద్ధమైన ఎడ్ల నడకలకు తాళం వేస్తున్నట్టుగా ....మోగే హరిదాసుల చిడతలు.... ఆ దాసు గారి హరి నామ సంకీర్తనలకు రూపమిచ్చినట్లుగా ఇళ్ల లోగిళ్లలో వెల్లివిరసే ముగ్గులు... ఆపై అందంగా పేర్చిన గొబ్బెమ్మలు. ఒక్క ధనుర్మాసంలో మాత్రం కనిపించే సుందరదృశ్యాలివన్నీ. చలి పులి గిలిగింతలు పెట్టేవేళ.... కొత్త పంటలు ఇంటికి చేరేవేళ.....అంబరాన్ని తాకే ఆనందంతో ఆహ్లాదంగా జరుపుకునే ఆనందాల కాంతే... సంక్రాంతి.

బొబ్బెమ్మల చల్లటి స్పర్శకు గరికపూస చెరుకు గడలా నిటారుగా నిల్చుంటుంది.. రంగురంగుల రంగవల్లుల నడుమ కొలువుదీరిన బొబ్బెమ్మలు, వాటి చుట్టూ అడుగులో అడుగులు కలుపుతూ.. కోలలు ఆడుతూ .. వయ్యారంగా కదిలే ముద్దుగుమ్మలు.. తెలిమంచు కురిసే వేళ చూడ చక్కగా కనువిందు చేసే ఈ పరవశానికి తోడు.. సన్నాయి వాయిద్యంతో బసవన్న గజ్జల చప్పుడు లయకలుపుతూ.. తల ఊపుతూ డోలు డప్పుకు తాళం వేస్తుంటే.. పెద్దలు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు.

వాకిట్లో రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నట్టు దూది పింజల్లా మబ్బుల్లోకి దూసుకెళుతున్న పతంగులు రంగ వల్లుల్లా ఆకాశం నిండా పురచుకోవాలని చూస్తాయి. దూరం నుంచి చూసే వారికి ఏ దారం లేని .. ఆదారం లేని కొత్త పక్షులు నింగి దారుల్లో చెక్కర్లు కొడుతున్నట్టు కనిపిస్తాయీ పతంగులు.. ఎవరి పతంగి ఎంత ఎత్తుకు ఎగురుతుందో వారే గొప్ప.. పతంగులను గాలిలోకి ఎగరవేయడం కూడా ఓ కళే మరి.

చలిగాలికి తోడు.. నులివచ్చని సూరీడి కిరణాలు బంగారు రంగులో... రంగవల్లులకు కొత్త అందం తెచ్చిపెడుతుంటే.. పైరగాలి మోసుకొచ్చే ముద్దబంతి పూల పరిమళాలు మంచుతడికి మత్తుగా ఊగుతున్న కొమ్మలకు కొత్త రాగాలను నేర్పుతాయి. మంచుదుప్పటిని తొలగిస్తున్న సూరీడికి ఆహ్వానం పలుకుతూ నేతితో చేసిన పిండివంటల ఘుమఘుమలు ముక్కు పుటాలను గుభాళిస్తాయి. సకినాలు, చెక్కర పొంగలి, అరిసెలు.. కొత్త రుచులను చూపిస్తాయి. ఏ ఇల్లు చూసినా పూల లోగిళ్లతో.. ముగ్గుల ముంగిళ్లతో.. కమ్మటి వాసనలతో... పండుగంటే ఇదీ అనిపిస్తుంది.

మన దేశ చరిత్రలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగకూ ఓ అర్దం పరమార్ధం ఉన్నట్టుగానే.. సంక్రాంతికీ ఓ విశిష్టత ఉంది. సూర్యుడి మాసానికో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో మకర రాశిలోకి సంక్రమించడాన్ని మకరసంక్రమణం అంటారు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. అయితే మకర సంక్రాంతికి ఇంతటి విశిష్టత ఎందుకంటే.. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. వివిధ రకాల పుణ్యకార్యాలకు ఇదే మంచి మాసం.. తొలిపంట గాదెలను పలకరించేది కూడా ఇదే రుతువు. అందుకే ఈ పండుగంటే.. రైతులకు.. వారిని నమ్ముకున్న వ్యాపారులకు.. పట్టణాల్లోంచి పల్లెలకు పిలిచే పురవాసులకు సంతోషం.

సాధారణంగా పండుగంటే ఒక్కరోజుతో ఆ సందడి ముగిసిపోతుంది కానీ ఈ పెద్ద పండుగ మాత్రం మూడు రోజుల వేడుక భోగి, మకర సంక్రాంతి, కనుమ.. ఇది ఓ ముచ్చటైన పండుగ. నూతన వస్త్రాలు, పిండివంటలు, కొత్తఅల్లుళ్లు. ఇలా సంబరమంతా సంక్రాంతి సందిట్లోనే దాగి ఉంటుంది. అందుకే సంక్రాంతి పండుగంటే చాలు ....ఇల్లంతా సందళ్లే ...ఊరంతా సంబరాలే.

సంక్రాంతి అందాలు చూడాలంటే పల్లెలోగిళ్లలోనే చూడాలి. వంకలు తిరిగిన వాగులు. మంచు బిందువులతో దోబూచులాడుతూ సూర్యకాంతికి తొంగిచూస్తున్న పైరులు. ఆ ప్రకృతి కాంతతో పోటీ పడుతూ పట్టంచు పరికిణీలు సింగారించుకొని పరుగులు తీసే కన్యల అందాలు .. ఇలాంటి సోయగాలన్నీ తిలకించాలంటే పల్లెటూళ్లకు పరుగులు తీయాల్సిందే. అందుకే సంక్రాంతి పండుగంటే చాలు .... పిన్నలనుంచీ పెద్దలదాకా పట్టణాలొదిలి ....పల్లెల్లోనే జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.


తెలతెలవారుతున్న వేళ... తొలికూడి కూతతో పాటూ మనకు వీనులవిందు.....కనువిందూ చేసే మరో దృశ్యం.....హరిదాసులు. ఎర్రటి పట్టుపంచెలు కట్టి ....నుదుటన తిరుమణి పట్టెలు పెట్టి ....తలపై అక్షయపాత్రతో చేతిలో తంబురతో ....నిండైన అలంకరణతో .....నడివీధుల్లో తిరుగాడే అపురూపమైన దృశ్యాలు మనకు ఒక్క సంక్రాంతి నెలలో మాత్రమే కనిపిస్తుంటాయి. సంక్రాంతికి నెలపెట్టిన దగ్గర నుంచి ....ఈ హరిదాసుల హరినామస్మరణలతోనే పల్లె నిద్రలేవాలి.

హరిలో రంగ హరి ......శ్రీమద్రమణా రమణ గోవిందో హరి అంటూ ఇంటింటికీ తిరిగే ఈ హరిదాసులకు శక్తి కొద్దీ బియ్యం, స్వయంపాకం, నూతన వస్త్రాలు సమర్పిస్తుంటారు. స్వయంగా ఆ శ్రీహరే ...ఆదిభిక్షువుగా మారి తమ ఇంటికి వచ్చినట్లు భావిస్తారు. భక్తిశ్రద్ధలతో ఆ హరిదాసుకు నమస్కరిస్తారు.

నెలగంటు పెట్టిననాటి నుంచి కనుమపండుగ ముగిసేవరకూ ఈ హరిదాసుల శోభ గ్రామసీమల్లో కనువిందుచేస్తూ ఉంటుంది. హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడే సందడి. దోసెళ్ళతోను, పళ్ళాలతోను బియ్యం తీసుకువచ్చి అక్షయపాత్రలో పోస్తారు. ఆ హరిభక్తులైన ఈ హరిదాసులకు మొక్కితే చాలు .గ్రామసీమలు చల్లగా ఉంటాయని ప్రజలకు నమ్ముకం. అందుకే ఈ సనాతన సంప్రదాయం నేటికీ గ్రామసీమల్లో కనిపిస్తూనే ఉంటుంది.


సంక్రాంతివేళ సందడి చేసే మరో అపురూపమైన దృశ్యం. గంగిరెద్దుల మేళం. అలనాడు ఆ శ్రీహరే స్వయంగా గంగిరెద్దులను ఆడించేడని శాస్త్రం చెపుతోంది, అందుకే ఈ పర్వదినాల్లో..... ఇలా ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులచేత విన్యాసాలు చేయిస్తుంటారు. తమకొచ్చిన సంగీత పరిజ్ఞానాన్ని సన్నాయిపై ప్రదర్శిస్తూ..అయ్యగారికి దణ్ణంపెట్టు. అమ్మగారికి సలాం కొట్టు అంటూ గంగిరెద్దులను నాడించేవాళ్లు... ఇలా చెపుతుంటే అందంగా ముస్తాబైన ఎద్దులు తలలాడిస్తూ వందనాలు చెపుతుంటే ...ఆ దృశ్యాలెంత అపురూపం అనిపిస్తుంటుంది.

ముగ్గులు కొలువుదీరిన ఇళ్ల వాకిళ్లముందు ఇలా గంగిరెద్దులను ఆడించడం పల్లెప్రాంతాల్లో ఎంతో శుభశూచకంగా భావిస్తుంటారు. పూర్వం రోజుల్లో ఈ గంగిరెద్దులు ఏడాదంతా సందడి చేసినా ...ఆధునికత పరుగులు పెడుతున్న ఈ కాలంలో ....ఈ గంగిరెద్దులాటలు ....కేవలం ఏవో పండుగలు కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితమైపోయాయి. కానీ గంగిరెద్దులమేళం వచ్చిందంటే వూరంతా సందడే.. వీధివీధంతా హడావిడే.

పిండివంటలు లేని పండుగ పండుగే కాదంటారు. అందునా ఆ పండుగ సంక్రాంతి అయితే ... నెల ముందు నుంచే వంటకాల సువాసనలు గుమ్మెత్తించేస్తుంటాయి. ఇక ఆడాళ్లంతా ....వంటకాల హడావిడిలో ఉంటే ....మగవాళ్లు మాత్రం పందేలజోరులో బిజీబిజీగా గడుపుతారు. కోళ్లపందేలు, ఎడ్లపందేలు, సంక్రాంతి మూడు రోజులూ సందడి చేసే అపురూపదృశ్యాలు.


పెద్ద పండుగంటే పల్లెప్రాంతాల్లో ముఖ్యంగా పందేలకే ప్రాధాన్యమిస్తారు. తమ పరువు ప్రతిష్టలను ఒడ్డి మరీ ఈ పందేలను నిర్వహిస్తుంటారు. పందేల్లో తమ కోళ్లు లేదా ఎడ్లు గెలిచేందుకు ....నెలా, రెండునెలల ముందునుంచే వాటి పోషణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జీడిపప్పు, మటన్ పెట్టి మరీ వాటిని సమరానికి సన్నద్ధం చేస్తుంటారు. ఇలా పందేల్లో ఓడి కోట్ల ఆస్తులను రాత్రికి రాత్రి పోగొట్టుకున్నవారున్నట్లే. పందెంలో గెలిచి రాత్రికిరాత్రి లక్షలాదికారులైనవారూ లేకపోలేదు.

పందెంలో గెలిచిన కోడిని మహారాజులా ముద్దుచేస్తే .....పందెం ఓడిపోయిన కోడి మాత్రం ....మందులోకి విందుగా మారాల్సిందే. నేటికీ పల్నాటి పౌరుషాన్ని తలదన్నే రీతిలో కోళ్లపందేలను నిర్వహిస్తారంటే .....పండుగల్లో వీటికి ఎంత ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సంకురాత్రి పండుగంటే ....సందడంతా తెలుగింటి పల్లెల్లోనే ఉంటుందని చెపుతుంటారు. ఈ పండుగ సమయాన ....ఏ పల్లె పట్టును చూసినా ....ఆ మాట నిజమే సుమా అని అనిపిస్తుంటుంది. మదిని మైమరపిస్తూ ఉంటుంది.

భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి.....సిరుల కాంతులు వెదజల్లే సంక్రాంతి. పాడిపంటల పండుగ కనుమ. ఈ మూడు ముచ్చటైన పండుగలను తెలుగునాట ఎంతో వేడుకగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు ఇది పెద్దల పండుగ అంటారు. ఈ రోజున పితృదేవతకు నివేదనలు చేస్తారు. ఇంటిల్లపాదీ కొత్తబట్టలు ధరించి పండుగ చేసుకుంటారు. ఇళ్లకొచ్చిన ఆడపడుచులతో , కొత్తల్లుళ్లతో , చిన్నపిల్లలతో ....ప్రతీ ఇల్లూ నిండుగా వెలిగిపోతూ ఉంటుంది. ప్రతీ లోగిలీ ....పౌష్యలక్ష్మి కొలువుదీరిన వైభవంతో కళకళలాడుతూ ఉంటుంది.


ఇక మూడవరోజైన కనుమనాడు పాడిపంటల పండుగ. పంటలు ఇంటికొచ్చి .....గాదెలు నిండుగా ఉన్న తరుణాన ...ఈ పెద్ద పండుగ రావడంతో ....ఆ సంతోషంలో ....పాడిపశువులకు, యంత్రాలకు రైతులు పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ పండుగమూడు రోజులూ పిల్లలూ పెద్దలు కూడా పాల్గొనే మరో వేడుక పతంగుల పందేలు. ఆకాశంలో పైకి పైపైకి తమ గాలిపటాలు ఎగురుతుంటే .....పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లల్లా కేరింతలు కొడతారు. అన్నీ ఒత్తిళ్లనూ మరచిపోయి.....స్వేచ్ఛావిహంగాల్లా పండుగశోభలో భాగస్వామ్యులవుతారు.

అవనిపై పౌష్యలక్ష్మి సందడి చేసే వేళ......ప్రకృతి కొత్త సొగసులు సంతరించుకునే వేళ....ఉదయభానుడు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తేవేళ.....చలిపులి పారిపోతూ మరింత గిలిగింతలు పెట్టేవేళ వచ్చే ఈ సంబరాల సంక్రాంతి.....ప్రతీ పల్లెకూ పండుగే....ప్రతీ ఇంటికీ వేడుకే.

Tags:    

Similar News