Personal information on Internet: నెట్ లోనూ వ్యక్తిగత సమాచారం.. ముప్పు తప్పదంటున్న మేధావులు

Personal information on Internet: పెరిగిన ఆన్లైన్ వినియోగంతో పాటే ముప్పు పొంచివున్నా వినియోగదారులు పట్టించుకోవడం లేదు.

Update: 2020-07-21 03:20 GMT
Cyber Alert

Personal information on Internet: పెరిగిన ఆన్లైన్ వినియోగంతో పాటే ముప్పు పొంచివున్నా వినియోగదారులు పట్టించుకోవడం లేదు. ఏదోలా తన పని అయిపోతుందులే అనే తప్ప, భవిషత్తులో పొంచిఉన్న ముప్పును పసికట్టలేకపోతున్నారు. ఇలా కొనసాగినంత కాలం ఏమీ కాదు... ఒక వేళ ఏదైనా జరగకూడనిది జరిగితే సైబర్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వ్యక్తిగత సమాచారంనకు సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

నిత్య జీవితంలో డిజిటల్‌ కార్యకలాపాలు సర్వసాధారణంగా మారిపోయాయి. నగదు లావాదేవీలు, ఆన్‌లైన్‌ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి వాటిని మెజారిటీ వ్యక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారానే పూర్తి చేస్తున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నగదు లావాదేవీలపై ఆధారపడడం కంటే ఈ విధానంలోనే చెల్లింపులు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. లావాదేవీలను చక్కబెట్టే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా అత్యధిక శాతం మంది వినియోగదారులు పట్టించుకోవడం లేదు. నెటిజన్లలో ఏకంగా 52% మంది సైబర్‌ భద్రతను పట్టించుకోవడం లేదని ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ సంస్థ ఓఎల్‌ఎక్స్‌ వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన 'ఇంటర్నెట్‌ బిహేవియర్‌' అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే..

– ఆన్‌లైన్‌ కార్యకలాపాల సమయంలో నెటిజన్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బయటకు చెప్పకూడని విషయాలను వెల్లడిస్తున్నారు.

– సోషల్‌ మీడియా సాధనాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి వాటిలో తమ పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని తేలింది.

– ఏకంగా 52 శాతం మంది తమ ఫోన్‌ నెంబర్లు, వ్యక్తిగత చిరునామా, ఇతర సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నారు.

– 26 శాతం మంది బ్యాంక్‌ లావాదేవీల సమయంలో తమకు వచ్చే ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్ట్‌వర్డ్‌)లను కూడా నిర్లక్ష్యంగా షేర్‌ చేస్తున్నారు.

– బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లు, వాటి పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్, క్రెడిట్, డెబిట్‌ కార్డు వివరాలను 22% మంది ఇతరులతో పంచుకుంటున్నారు.

– 73 శాతం మంది టరమ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను (నిబంధనలు–షరతులు), లీగల్‌ గైడ్‌లైన్స్‌ను చదవడంలేదు. వీటిని పరిశీలించకుండానే ఆమోదించడం, స్కిప్‌ చేయడం వంటివి చేస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే ఆయా ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ను సైన్‌ చేసే సమయంలో పూర్తిగా చదువుతున్నారు.

– 61 శాతం మంది నెలలో ఐదు కంటె ఎక్కువసార్లు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు బదిలీ చేయడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం చేస్తున్నారు. ఇక 37 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకుంటున్నారు.

– 60 శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో పట్టించుకోవడంలేదు.

– సర్వే కోసం.. 15 నుంచి 55 సంవత్సరాల వయసున్న 7,500 మంది ఇంటర్నెట్‌ వినియోగదారులను విశ్లేషించినట్లు ఓఎల్‌ఎక్స్‌ పేర్కొంది.


Tags:    

Similar News