Viral Video: ఈ వీడియో చూస్తే గుండె బరువెక్కడం ఖాయం..!
Viral Video: ప్రతీ తల్లిదండ్రి తమ పిల్లల విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. పిల్లల కోసం జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.
Viral Video: ప్రతీ తల్లిదండ్రి తమ పిల్లల విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. పిల్లల కోసం జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ఎలాంటి లాభం ఆశించకుండా పిల్లల అభివృద్ధిని కోరుకుంటారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా పిల్లల విజయాల్లోనే తమ విజయాన్ని వెతుక్కుంటారు. పిల్లలు సక్సెస్ అయినప్పుడు వారి సంతోషానికి అవధులు ఉండవు. ప్రపంచాన్ని జయించామన్నంత సంతోషపడుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ తల్లికొడుకుల మధ్య జరిగిన సంఘటన గుండె బరువెక్కిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల కళ్లు చెమ్మగిలుతున్నాయి. ఇంతకీ వీడియోలో ఏముందనేగా.. ఓ పెద్దావిడ రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు విక్రయిస్తోంది. అదే సమయంలో భుజాన బ్యాగ్ ధరించిన కొడుకు తల్లి దగ్గరికి వచ్చాడు. ఏదో విషయం చెప్పాడు. దీంతో వెంటనే పైకి లేచిన ఆ మహిళ కొడుకును గుండెలకు హత్తుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. దీంతో తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక అతడు అలాగే ఉండిపోయాడు.
అయితే ఆ యువకుడి పేరు యోగేశ్ అని, సీఏ పూర్తి చేసిన విషయాన్ని తల్లికి చెప్పడంతో సంతోషంలో మహిళ అలా ఏడ్చిందని తెలుస్తోంది. పేద కుటుంబంలో జన్మించిన యోగేశ్ ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశాడు. కొడుకు సాధించిన అద్భుతమైన విజయానికి తల్లి కంటతడి పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. కొడుకు విజయం సాధిస్తే తల్లి పడే ఆనందం ఇలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ వీడియోను మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు.. 'సీఏ లాంటి కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన యోగేశ్‌ని అభినందించకుండా ఉండలేం. డోంబివిలి ప్రాంత వాసిగా యోగేశ్ విజయానికి సంతోషిస్తున్నానని' రాసుకొచ్చారు.