Marriage Muhurtham Dates: ముగిసిన ముహుర్తాలు.. మళ్లీ దసరాకే
Marriage Muhurtham Dates అసలే లాక్ డౌన్... బయట తిరగని పరిస్థితి... శుభకార్యాలు ఏమవుతాయిలే అని అందరూ అనుకున్నారు.
Marriage Muhurtham Dates అసలే లాక్ డౌన్... బయట తిరగని పరిస్థితి... శుభకార్యాలు ఏమవుతాయిలే అని అందరూ అనుకున్నారు... అయితే దానికి భిన్నంగా పెళ్లిళ్లు, కొత్త ఇంటిలోకి ప్రవేశం ఇతర శుభ కార్యక్రమాలన్నీ పూర్తిచేశారు. దీనికి తగ్గట్టు శ్రావణ మాసం కావడంతో గతంలో మాదిరి అన్నీ సాధారణంగా ముగిశాయి. అయితే లాక్ డౌన్ కారణంగా అన్నీ పరిమిత సంఖ్యలో చేసి, కానిచ్చేశారు. అయితే ప్రస్తుతం శుభ ముహుర్తాలు ముగియడంతో ఇలాంటి కార్యక్రమాలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పాల్సిందే. మరలా ముహుర్తాలు రావాలంటే దసరాకే అంటున్నారు వేదపండితులు.
కరోనా, లాక్‌డౌన్ నిబంధనలతో ఇప్పటివరకు నిరాడంబరంగా కొనసాగుతూ వస్తున్న శుభకార్యాలకు ఇక తెరపడనుం ది. శుక్రవారంతో శుభ ముహూర్తాలు ముగియనున్నాయి. మరో రెండు నెలల వరకు వివాహ, శుభకార్యాల ముహూర్తాలు లేవు. కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి రెండున్నర నెలల పాటు అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల విక్రయ దుకాణాలు మినహా మిగ తావన్నీ మూతబడ్డాయి. అసలే వివాహాలు, శుభకార్యాలు జోరుగా సాగే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో వీటి నిర్వహణ అయోమయంలో పడింది. ఇంతలో కాస్త వెసులుబాటునిస్తూ అతి తక్కువ మందితో భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. దీంతో శుభకార్యాలను వాయిదా వేసుకుందామనుకున్న వారంతా నిరాడంబరంగా చేసుకునేందుకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండగా, లాక్‌డౌన్ సీజన్‌లోనే మంచి ముహూర్తాలు దాదాపు వెళ్లిపోయాయి. ఇక, ఆగస్టు 14.. చివరి శుభ ముహూర్త తేదీ. ఈరోజు తప్పిందంటే శుభకార్యాలు చేసుకునే వారంతా మరో రెండున్నర నెలలు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు.
మళ్లీ దసరా తర్వాతే..
శ్రావణ బహుళ దశమితో ప్రస్తుతం శుభకార్యాల ముహూర్తాలు ముగుస్తున్నాయి. భాద్రపద మాసంలో ఎక్కువగా పితృదేవతలకు నిర్వహించే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తుండడంతో శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు ఉండవు. తరువాత వచ్చే ఆశ్వయుజం అధిక మాసం వస్తుండడంతో శుభకార్యాలకు మరో నెల రోజులు బ్రేక్ పడనుంది. అనంతరం దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. దీంతో శుభకార్యాలు చేసుకునే వారంతా దాదాపు రెండున్నర నెలల పాటు ఆగాల్సిందే. మరోపక్క ఈ నెల 31తో అన్‌లాక్ 3.0 ముగియనుంది. వచ్చే నెలలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతివ్వనుంది. మరో రెండు నెలల్లో క్రమంగా అన్ని రంగాలు తెరుచుకుంటాయని, తిరిగి శుభ ముహూర్తాలు దగ్గరపడే నాటికి లాక్‌డౌన్ పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.