Indian Railways: ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ఇలా చేస్తున్నారా.. జరిమానా తప్పదంతే..!
Railways Sleeping Timing: మీరు చాలా దూరం రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
Railways Sleeping Timing: మీరు చాలా దూరం రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తోంది. తాజాగా రైళ్లలో ప్రయాణికులు నిద్రించే సమయాన్ని రైల్వేశాఖ మార్చింది. కొత్త రూల్ ప్రకారం, రైలులో ప్రయాణీకుల నిద్ర సమయం మునుపటితో పోలిస్తే తగ్గింది. ఇంతకుముందు ప్రయాణీకులు తమ ప్రయాణ సమయంలో 9 గంటల వరకు నిద్రపోయేవారు. కానీ, ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం, ఇప్పుడు మీరు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రించగలరు. గతంలో ఈ సమయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది.
రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకే..
నిద్రించేందుకు అనువుగా ఉన్నా రైళ్లలో ఈ నిబంధన అమలు చేయనున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ మార్పు చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సమయం నిద్రకు మంచిదని భావిస్తారు. ఈ నిబంధన అమలుకు ముందు, మిడిల్ బెర్త్ ప్రయాణికులు రాత్రి త్వరగా నిద్రపోతారని, తెల్లవారుజాము వరకు నిద్రపోతున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేసేవారు. దీంతో కింది సీట్లో కూర్చోవడం కష్టంగా మారింది. దీనిపై పలుమార్లు ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.
కొత్త రూల్‌తో ప్రయాణికులు
నిద్రపోయే సమయం ఖరారు కావడంతో నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకే నిద్ర లేవాల్సి ఉంటుంది. ఈ నియమం ప్రకారం, ఒక ప్రయాణీకుడు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు. నిజానికి ఇది ఎక్కువ సేపు తెరిచి ఉంటే లోయర్ బెర్త్‌లలోని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త నిబంధన ప్రకారం, కింద సీటులో ప్రయాణించే రిజర్వ్డ్ టిక్కెట్లు కలిగిన ప్రయాణీకులు రాత్రి 10 గంటల కంటే ముందు లేదా ఉదయం 6 గంటల తర్వాత తమ సీట్లపై పడుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎవరైనా ప్రయాణీకులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, రైలులోని టీసీకి ఫిర్యాదు చేయవచ్చు.