Gold Rates: బంగారం ధర ఇంకా తగ్గుతుందా? కొనడానికి ఇదే రైట్ టైమా, లేక వెయిట్ చేయడం మంచిదా?

Gold Rates: బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

Update: 2024-07-24 10:41 GMT

Gold Rates: బంగారం ధర ఇంకా తగ్గుతుందా? కొనడానికి ఇదే రైట్ టైమా, లేక వెయిట్ చేయడం మంచిదా?

Gold Rates: బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ నిర్ణయం పసిడి ప్రియుల్లో ఆనందాన్ని నింపింది. బడ్జెట్ ప్రకటన తరువాత బంగారం ధర ఒక్క రోజులోనే 10 గ్రాముల మీద 4,000 రూపాయలు తగ్గింది. వెండి ధర కిలోకు 3 వేల రూపాయలు తగ్గింది.

బడ్జెట్ ప్రభావం…

బంగారం పై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. గతంలో బంగారం మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతంతో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ది పన్ను 5 శాతం ఉండేది.

ఇప్పుడు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. వ్యవసాయ మౌలిక వసతుల పన్నను 5 నుంచి 1 శాతానికి పరిమితం చేశారు. దాంతో, బంగారం మీద పన్ను భారం 15 నుంచి 6 శాతానికి తగ్గింది.

జీఎస్టీతో కలిపి గతంలో 18 శాతంగా ఉన్న పసిడి పన్ను, ఆర్థిక మంత్రి తాజా నిర్ణయంతో 9 శాతానికి తగ్గుతుంది.

మంగళవారం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ. 72,838 గా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారం ధర రూ. 4,218 తగ్గింది.

భవిష్యత్తులో ధరలు ఇంకా తగ్గుతాయా?

పన్ను తగ్గింపుతో బంగారం ధర భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందా అనే అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తగ్గే అవకాశం ఉందనే అంటున్నారు ముంబయి బులియన్ మార్కెట్ నిపుణులు. అయితే, ఇది పరిమితంగానే ఉంటుందని వారు చెబుతున్నారు.

సమీప భవిష్యత్తులో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల వరకు పడిపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ తగ్గుదల కొంతకాలం వరకే ఉండవచ్చని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం ధర స్థిరంగా పెరుగుతూనే ఉంటుందని వారన్నారు.

బంగారం ధర ఎన్నేళ్ళకు ఎంత పెరుగుతుంది?

బంగారం ధరల చరిత్ర గమనిస్తే 5-6 ఏళ్ళకు అవి రెండింతలు అవుతున్నాయి. 2014లో 10 గ్రాముల బంగారం ధర 28 వేల రూపాయలు కాగా, అది 2019 నాటికి 35 వేల రూపాయలు దాటింది. ఆ తరువాత అయిదేళ్ళకు అంటే 2024 నాటికి ధర రెండింతలై 70 వేల మార్క్ ను క్రాస్ చేసింది.

ఇంకా, పాత చరిత్రలో లోకి వెళితే 1973లో పది గ్రాముల బంగారం ధర 278 రూపాయలే ఉండేది. ఆరేళ్ళకు అంటే.. 1979 నాటికి అది 791 రూపాయలకు పెరిగింది. 1987 మార్చి నాటికి 2,570 రూపాయలకు చేరింది. 2007లో గోల్డ్ రేటు 10 వేల మార్క్ క్రాస్ చేసింది. 2018లో 30 వేలు దాటింది.

అంటే, పన్ను తగ్గింపు ప్రభావం వల్ల రేటు తాత్కాలికంగా తగ్గినా దీర్ఘకాలంలో పసిడి ధర తగ్గేదే ఉండదని తెలుస్తోంది. అందుకే, భారతీయులకు బంగారం అంటే మోజు, అలంకారం కోసమే కాదు, మదుపు కోసం కూడా.

Full View


Tags:    

Similar News