Ganesh Chaturthi 2020: వినాయక చవితి..విఘ్నేశ్వరుడి పుట్టినరోజా? గణాధిపత్యం పొందిన రోజా?
Ganesh Chaturthi 2020: వినాయక చవితి ఎందుకు చేస్తారు?
ఊరూ-వాడా.. పట్నం-పల్లె.. సందూ-గొందూ ఇలా ఏ పక్కన చూసినా గజాననుడే కనిపిస్తాడు పదిరోజుల పాటు. ఎటు తిరిగినా గణాదీసుని గానామృతమే వినిపిస్తుంది. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి వచ్చిందంటే చాలు వినాయకుని పందిళ్ళ సందడి కనువిందు చేస్తుంది. (ఈసారి ఆ అవకాశం లేదనుకోండి) కానీ వినాయకుడి పండగంటే ఇంటింటా వేడుకే కదా. అసలు గణనాధుని పండుగ విషయంలో కొన్ని ప్రచారాలు ఉన్నాయి.. అవి ఏమిటో చూద్దాం..
ఏ శుభకార్యం చేసినా తొలి పూజ వినాయకుడికే చేస్తాం.. అతడినే ఆరాధిస్తాం.. సిద్ధిని, బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటాం.. అటువంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటారు. ఆదిపూజ్యుడుగా మనం వినాయకుడిని కొలుస్తాం. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరువాడ ఉత్సాహం.. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరూ గణేశ్ ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇంతకి భాద్రపద శుద్ధచవితిని కొందరు విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు.. గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు.
వినాయకుడు ఆది పూద్యుడు అంటారు.. అయితే శివ, పార్వతుల కుమారుడైన విఘ్నేశ్వరుడు ఆది పూద్యుడు ఎలా అవుతాడని సందేహం వస్తుంది. ఒక కల్పంలో మాత్రమే శివ పార్వతుల తనయుడిగా గణనాధుడు పుట్టాడని పురాణం చెబుతోంది. పార్వతీపరమేశ్వరుల కళ్యాణంలో కూడా గణనాధుని పూజ చేసినట్లు చెబుతుంటారు. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన పురాణంలో గణ శబ్ధానికి విజ్ఞానమని.. ణ అంటే తేజస్సు అని పేర్కొన్నారు.
పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా గణపతిని నియమించుకునట్లు వేదం చెబుతోంది.
ఇక విఘ్నేశ్వరుడు వివాహం విషయంలో కూడా విభిన్న వాధనలు ఉన్నాయి.. కొందరు విఘ్నేశ్వరుడి.. విశ్వరూ ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలతో వివాహం జరిగిందని.. వారికి పిల్లలు కూడా ఉన్నారని కొందరు అంటుంటారు.. మరోవైపు వినాయకుడు బ్రహ్మచారన్న వాదనలూ ఉన్నాయి.. ఏ పనిమీదైనా శ్రద్ధ చూపించడమే వినాయకుని లక్షణమని.. దాని వల్లే మహాభారతాన్ని రచించిన సమయంలో ఆటంకాలను అధిగమించాడని చెబుతుంటారు. అందుకే వినాయకుడిని పూజించడం వల్ల.. సిద్ధి, బుద్ధి వస్తాయని చెబుతుంటారు.
ఇవన్నీ పక్కన పెడితే.. వినాయక చవితి అనేది ప్రకృతికి దగ్గరగా ఉండే పండుగ.. విఘ్నేశ్వరుని బంగారం లేదా వెండి ప్రతిమల్లో కొలవలేని వారికి.. మట్టి బొమ్మను కొలిస్తే చాలు కోరికలు తీరుతాయని చెబుతారు.. దీని వెనుక మట్టిని పూజించమనే రహస్యం దాగి ఉంది.. ఇక పూజించేందుకు వాడే పత్రి, గణనాధుడికి పెట్టే నైవేధ్యాలు కూడా ఎంతో తేలికగా సేకరించేవే.. వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తారు. ఈ 21 పత్రి.. వైద్యంలో ఎంతో ముఖ్యమైనవి.. దీనిని సేకరించడం.. చేతులతో పట్టుకొని పూజ చేయడం ద్వారా.. వంటికి రోగాలు రావని నమ్ముతారు.. ఇక గణపయ్యకు చప్పిడి ఉండ్రాళ్లంటే ఇష్టమని వాటినే నైవేధ్యంగా పెడుతుంటాము.. ఇలా ఉడికించిన చప్పిడి ఉండ్రాళ్లు ఆరోగ్యానికి మంచిదని అందుకే పెద్దలు వాటిని నైవేధ్యంగా పెట్టారని చెబుతుంటారు. మొత్తానికి వినాయక చవితి సంప్రదాయ పండుగ మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని, ఆయుషుని పెంచే పండుగ.. అందుకే గణేశుడి ఆరాధన వల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.