'మహీంద్రా' స్కార్పియో ఇల్లెక్కింది..'ఆనందం' తెచ్చింది!
కారు ఇల్లెక్కితే ఎవరికైనా బాధ వేస్తుంది.. కానీ ఆనందం ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం పూర్తిగా చదివేయండి మరి..
కారు చాలా మందికి స్వప్నం. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతైనా కష్టపడతారు. రూపాయి..రూపాయి కూడబెట్టి కారు కొనుక్కుని మురిసిపోతారు. కొంతమందైతే మొదటి కారు కొన్నాకా ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇదిగో బిహార్ లో అలాంటి ప్రయత్నమే చేసిన ఓ వ్యక్తి కారు కథ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ కారు తయారు చేసిన కంపెనీ యజమానికి ఆనందాన్నిచ్చింది. మరి ఆ కథేమిటో.. అంత ఆనంద పడుతున్న కారు కంపెనీ యజమాని ఎవరో తెలుసుకుందామా?
బిహార్‌కు రాష్ట్రం భగల్‌పూర్‌కు చెందిన ఇంతజార్ ఆలమ్‌కు తన తొలి కారు స్కార్పియో అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి తన సంపాదన పోగేసుకుని ఆ కారు కొన్నాడు. తానెంత ఎదిగినా దాని మీద మక్కువ మాత్రం పోలేదు. అందుకే దానిని ఏకంగా తన ఇంటిపైకి ఎక్కించేశాడు.అంటే..అసలు కారు కాదు లెండి. అచ్చం తన స్కార్పియో ఆకారంలో నీటి ట్యాంకును కట్టుకుని.. కారు మీద తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నాడు.
ఇంతజార్ ఆలం తాను కూడబెట్టుకున్న డబ్బుతో ఒక స్కార్పియో కొనుగోలు చేశాడు. అది తన తొలి కారు అవడంతో చాలా అపురూపంగా చూసుకున్నాడు. కారు కొన్నందుకు గుర్తుగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. భార్య సలహాతో తన ఇంటి పైకప్పుపై అచ్చంగా స్కార్పియో ఆకారంలో నీటి ట్యాంక్‌ను నిర్మించుకున్నాడు. ఇందుకోసం ఆగ్రా నుంచి కూలీలను తెప్పించి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. పూర్తిగా స్కార్పియో ఆకారంలో ఉన్న ఈ ట్యాంక్‌కు తన కారు నంబర్లతో నంబరు ప్లేట్ కూడా పెట్టించాడు.
దీంతో ఈ ఇల్లెక్కిన కారు నెట్టిల్లు కూడా ఎక్కేసింది. ఇంకేముంది ఇంతజార్ ఇంటి ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ పోస్టు కాస్తా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను చేరింది. ఓ ట్విటర్ యూజర్ పెట్టిన స్కార్పియో వాటర్ ట్యాంక్ ఫొటోకు స్పందించిన ఆనంద్ మహీంద్రా ఇంతజార్ ఆలోచనకు ఫిదా అయ్యారు. 'ఎదగడం అంటే ఇదే.. స్కార్పియో ఇంటి పైకప్పు వరకు ఎదిగింది. దీని యజమానికి నా సలామ్. తన తొలి కారుపై అతడికున్న అభిమానానికి సెల్యూట్' అంటూ ఇంతజార్‌ను ప్రశంసించారు.