కాంగ్రెస్‌లో చేరిన శరద్‌ యాదవ్‌ కుమార్తె

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు పెద్ద ఊపునిచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్ తంత్రిక్ జనతాదళ్..

Update: 2020-10-14 11:30 GMT

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు పెద్ద ఊపునిచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్ తంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె సుభాషిని రాజ్ రావు.. బుధవారం ఢిల్లీలోని సీనియర్ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కాశీ పాండే కూడా కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరూ బీహార్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. బీహార్‌లో 'మహాగడ్బంధన్' పోరాటాన్ని కొనసాగించే బాధ్యతను తాను ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నానని, ముఖ్యంగా తన తండ్రి కూడా ఎప్పుడూ దీనికి అనుకూలంగానే ఉన్నారని.. వృత్తి రీత్యా సామాజిక కార్యకర్త అయిన సుభాషిని అన్నారు.

పార్టీలో చేరడానికి తనకు అవకాశం కల్పించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకు కృతజ్ఞతలు తెలిపారామె. ఇక ఆరోగ్యం బాగా లేనందున తన తండ్రి శరద్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడం లేదని అయితే 'మహాగడ్బంధన్' కు ఆయన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. ఇక కాంగ్రెస్ లో చేరిన కాశీ పాండే.. 1980 లో బీహార్ విధానసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు, తరువాత 1984 లో పార్లమెంటు ఎన్నికలలో గోపాల్‌గంజ్ నుండి విజయం సాధించారు. కాగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

Tags:    

Similar News