Mahakumbh 2025: మహాకుంభమేళా చరిత్ర ఏంటి? ప్రయాగ్ రాజ్‌లోనే ఎందుకు నిర్వహిస్తారు?

Update: 2025-01-11 15:15 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ జరగనుంది. 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరుగుతుంది. దీన్ని మహా కుంభమేళాగా పిలుస్తున్నారు. 144 ఏళ్లకు వచ్చేది మహా కుంభమేళా. ఈ కుంభమేళాను ప్రయాగ్ రాజ్ లోనే నిర్వహిస్తారు. అసలు కుంభమేళలో ఎన్ని రకాలుంటాయి, మహాకుంభమేళాకు ఇతర కుంభమేళాకు తేడా ఏంటి? ప్రయాగ్ రాజ్ లోనే మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? కుంభమేళకు ఉన్న చరిత్ర ఏంటి? ఎంత మంది భక్తులు ఈ కుంభమేళాకు వస్తారు? కుంభమేళాకు నాగ సాదువులకు సంబంధం ఏంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Full View

కుంభమేళాలు ఎన్ని రకాలు?

కుంభమేళాల్లో నాలుగు రకాలుంటాయి. 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది మహా కుంభమేళా. ఇది 12 పూర్ణకుంభమేళాలతో సమానం. ప్రయాగ్ రాజ్ లోనే దీన్ని నిర్వహిస్తారు. ఇక ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే వేడుకలను కుంభమేళా అంటారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయినిలలో నిర్వహిస్తారు. ఇక మూడోది ఆరేళ్లకోసారి నిర్వహించే అర్ధకుంభమేళా. దీన్ని హరిద్వారా, ప్రయాగ్ రాజ్ లలో నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏటా నిర్వహించేది మినీ కుంభమేళా. ప్రతి ఏటా మాఘ మాసంలో ప్రయాగ్ రాజులో దీన్ని నిర్వహిస్తారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా కుంభమేళా. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరిగేది ఈ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా. మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని చెబుతారు.

కుంభమేళా చరిత్ర

క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలో గుప్తుల పాలనలో కుంభ మేళా నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ఠ మరింత పెరిగింది. కుంభ మేళా సమయంలో దేవుళ్లు భూమి మీదకు వచ్చి దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. బ్రిటిష్ పాలనలో కూడా కుంభమేళా నిర్వహించినట్టు ఆధారాలున్నాయి. 1918లో జరిగిన మహా కుంభ మేళాలో మహాత్మాగాంధీ కూడా పాల్గొన్నారని చెబుతారు. కుంభమేళాతో ప్రజలంతా కలిసి ఏకమయ్యే అవకాశం ఉందని బ్రిటీష్ పాలకులు కుంభమేళాపై పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. ఈ మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.

ప్రయాగ్ రాజ్ లోనే మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు?

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభమేళా ప్రారంభం అవుతుంది. పురాణాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళాగా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళాను చేసే సంప్రదాయం ఏర్పడింది. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు.

కుంభమేళా తేదీలు, వేదికలు ఎలా నిర్ణయిస్తారు?

ఖగోళ శాస్త్రం ప్రకారంగా కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు.. ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా ఏర్పాటు చేస్తారు.

ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళాలు ఎందుకు చేస్తారు?

పురాణాల కథనాల ప్రకారంగా దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. అమృతం చుక్కలు ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, హరిద్వార్, నాసిక్ లలో పడ్డాయని నమ్ముతూ అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.

మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వచ్చే ఛాన్స్

అఖాడాల నుంచి సాదువుల వరకు కుంభమేళాలో పుణ్నస్నానాలు చేస్తారు. కుంభమేళా సమయంలోనే సాదువులు కన్పిస్తారు. ఈ సాదువులను చూసేందుకు భక్తులు ఎదురు చూస్తారు. 2025 జనవరి 13 పౌష్ పూర్ణిమ, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి పర్వదినాల్లో పుణ్నస్నానాలు ఆచరించేందుకు సాదువులు పెద్ద ఎత్తున వస్తారు. 2013లో జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాదువులు సుమారు 20 కోట్ల మంది వచ్చారని అంచనా. ప్రస్తుతం జరిగే మహాకుంభమేళాకు 45 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కుంభమేళాకు కేంద్రం 2100 కోట్లను స్పెషల్ గ్రాంట్ గా మంజూరు చేసింది. కుంభమేళాకు కేంద్రం 2100 కోట్లను స్పెషల్ గ్రాంట్ గా మంజూరు చేసింది. మహాకుంభమేళాకు 6,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మీడియాకు చెప్పారు. 2013లో నిర్వహించిన కుంభమేళాకు 4,500 కోట్లు ఖర్చు చేశారు.కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో హారతి ఇస్తారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో హారతి ఇస్తారు.

సాధువులకు ప్రత్యేక ఏర్పాట్లు

మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున సాదువులు హాజరౌతారు. వీరి కోసం ప్రయాగ్ రాజ్ లో స్థలాలు కేటాయించారు. 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6 లోని సంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాలను నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేసుకున్నారు. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు భక్తులను దర్శనానికి, పూజలకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మహాకుంభమేళాలో తొలుత నాగ సాదువులు, ఆ తర్వాత సాదువులు, అఖారాలు స్నానం చేస్తారు. వీరి తర్వాతే సామాన్యులు స్నానం చేయాలని చెబుతారు.

ప్రయాగ్ రాజ్ లో భక్తులకు ఏర్పాట్లు

మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్‌లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్‌లను నిర్మించారు. ఆరోగ్య సేవల కోసం తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ కూడా 10 బెడ్స్ తో ఐసీయూ ఏర్పాటు చేసింది. 300 మంది డాక్టర్లు, వైద్య నిపుణులు, 90 మంది ఆయుర్వేద, యునానీ నిపుణులు, 200 నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరోవైపు డోమ్ సిటీని కూడా నిర్మిస్తున్నారు. 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో డోమ్ సిటీని 51 కోట్లతో నిర్మించారు. 32 అడుగుల పరిమాణంతో 44 డోమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలున్నాయి. మహా కుంభమేళాలో ఒక్క డోమ్ కాటేజీ ధర 1.10 లక్షలుగా నిర్ణయించారు.

అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా

మహా కుంభమేళా బందోబస్తుకు 50 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. 2700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల లోతుకు వెళ్లే అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. మహాకుంభమేళాలో పుణ్నస్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు ఫ్లోటింగ్ చేంజింగ్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. సాధారణ భక్తులతో పాటు వీఐపీల కోసం 12 జెట్టీలపై దుస్తులు మార్చుకునే గదులు నిర్మించారు. గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించగా, ఈసారి 30 బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

మహా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ నడుస్తోంది.సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కు 25 గంటల ప్రయాణం. కుంభమేళా నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే 1225 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కుంభమేళా జరిగే 40 రోజుల్లో 40 రైళ్లు నడపనున్నారని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ చెప్పారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కు విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. విమానంలో సుమారు 2 గంటల్లో ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు.

మహా కుంభమేళా అధ్యాత్మిక కార్యక్రమమే కాదు.. సాంస్కృతిక పండగ కూడా. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రయాగ్ రాజ్ లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు 45 రోజులు తమ కళారూపాలను ప్రదర్శిస్తారు. 144ఏళ్ల తర్వాత వచ్చే మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూపీ సర్కార్ చర్యలు చేపట్టింది. కుంభమేళాకు విదేశాల నుంచి కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. 

Tags:    

Similar News