90 hours work per week: ఆఫీస్ వాష్‌రూమ్స్‌లో ఏడిచేదాన్ని.. '90 గంటల పని'పై రాధిక పోస్ట్ వైరల్
Edelweiss CEO Radhika Gupt: వారానికి 90 గంటల పనివేళలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి లాంటి వాళ్లు ప్రతిపాదించిన ఈ 90 గంటల వర్కింగ్ హవర్స్ ప్రతిపాదనకు మద్దతిస్తున్న వాళ్లు ఒకరిద్దరైతే... అందుకు వ్యతిరేకంగా అమ్మ బాబోయ్ అంటూ తమ అభిప్రాయాలను వినిపిస్తోన్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఈడిల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈఓ రాధిక గుప్త కూడా ఆ జాబితాలో చేరారు. ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఈ ప్రతిపాదనకు అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాధిక గుప్త సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన గత అనుభవాలనే ఆధారంగా చేసుకుని ఆ పోస్ట్ రాసినట్లు ఆమె తెలిపారు.
ఇంతకీ రాధిక గుప్త ఏం చెప్పారంటే...
90 గంటలు కాదు... తన ఫస్ట్ ప్రాజెక్టుపైనే 4 నెలల పాటు వారానికి ఏకంగా 100 గంటలు పనిచేశాను. వారానికి ఒక్క వీకాఫ్ తీసుకుంటూ రోజూ 18 గంటలు వర్క్ చేశాను. అందులో 90 శాతం అవస్థపడుతూ పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఆఫీస్ వాష్ రూమ్స్ లోకి వెళ్లే ఏడవడం తనకు ఇప్పటికీ గుర్తుందన్నారు. నిద్ర ఆపుకుంటూ కంటిన్యూగా పనిచేయడం కోసం అర్ధరాత్రి 2 గంటలకు చాక్లెట్ కేక్ తినడం జరిగేది. అలా రెండుసార్లు ఆస్పత్రిపాలయ్యాను. అంత కష్టపడి వారానికి 100 గంటలు పనిచేసినా అంత ఔట్‌పుట్ ఉండేది కాదన్నారు.
ఛాయిసెస్, హార్డ్2వర్క్, హ్యాపీనెస్ అనే పేరుతో రాధిక గుప్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులోనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎక్కువ గంటలు పనిచేస్తే ఔట్‌పుట్ పెరుగుతుందన్న వాదనను ఆమె తీవ్రంగా ఖండించారు. పైగా అందుకు తన వ్యక్తిగత అనుభవమే ఉదాహరణ అంటూ ఆమె తన రియల్ స్టోరీని ఆ పోస్టు ద్వారా నెటిజెన్స్‌కు వివరించారు. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో వర్కింగ్ టైమ్స్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే ఉందన్నారు. ఆ టైమ్‌లోనే సరైన టెక్నాలజీ ఉపయోగించి, సరైన్ ఔట్‌పుట్ ఇచ్చామా లేదా అనేదే ముఖ్యమని రాధిక గుప్త అభిప్రాయపడ్డారు.
వారానికి 90 గంటలు అని ఉద్యోగులపై పని ఒత్తిడి రుద్దే ముందు వారి మానసిక ఆరోగ్యం, కుటుంబ బాధ్యతల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని బాసులు పట్టించుకోవలం లేదన్నారు. ఉాహరణకు తనకు పెళ్లి కాక ముందు ఒంటరిగా ఉన్నప్పుడు ఆఫీసులో ఎన్ని గంటలైనా పనిచేయగలిగాను. కానీ ఇప్పుడు కుటుంబం బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఇల్లు కూడా చూసుకోవాలని చెప్పారు. అందరికీ, అన్ని సందర్భాల్లో అధిక పని ఒత్తిడి సాధ్యం కాదనే విషయాన్ని రాధిక గుప్త గుర్తుచేశారు. ఆమె ట్వీట్‌కు భారీ స్పందన కనిపిస్తోంది. ఇది కేవలం మీ అభిప్రాయం మాత్రమే కాదని, ఎంతోమంది వేతన జీవుల అభిప్రాయాన్ని మీరు చెప్పారు అంటూ 90 గంటల పనివిధానాన్ని వ్యతిరేకించే వారు ఆమెను సమర్థిస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.