Monsoon Session 2021: కాసేపట్లో పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభం
Monsoon Session 2021: 29 సాధారణ బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
Monsoon Session 2021: కాసేపట్లో పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రప్రభుత్వం 29 సాధారణ బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులను ఉభయ సభల ఆమోదం కోసం ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో మూడు బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకురావడానికి ఉద్దేశించినవే.. కొత్త సినిమాటోగ్రఫీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ బిల్లు పాసైతే సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించే అధికారం కేంద్రానికి వస్తుంది.
ఇటు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతున్నాయి. కరోనా కట్టడి, మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వ లోపాలను అస్త్రాలుగా మల్చుకోనున్నాయి. వ్యవసాయ చట్టాలు, సరిహద్దుల్లో చైనా దూకుడుపై మాటల దాడి చేసేందుకు ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ఇంధన ధరల పెరుగుదలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ఫిక్సయ్యాయి.
అయితే పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష భేటీకి 33 పార్టీలు హాజరయ్యాయి. ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు విపక్షాల నేతలు అఖిలపక్షంలో డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్డీయే ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సి వ్యుహంపై దిశానిర్ధేశం చేశారు.
కరోనా రూల్స్‌ను పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనున్నారు. లోక్‌సభ ప్రధాన చర్చ ప్రాంగణంలో 280 మంది మాత్రమే కూర్చొంటారు. మరో 259 మంది సందర్శకుల గ్యాలరీలో కూర్చొంటారు. రాజ్యసభలోనూ ఇదే ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ తీసుకోని నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసుకోవాలని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. రాజ్యసభ, లోక్‌సభ రెండింట్లో మరో రెండు గంటల్లో చర్చలు ప్రారంభం కానున్నాయి.