drugs case :నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంటిలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు..
ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంటిలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు పోలీసులు వివేక్ ఇంటికి చేరుకుని సెర్చ్ చేశారు. కాగా డ్రగ్స్ కేసులో వివేక్ బావమరిది ఆదిత్య అల్వా పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన బెంగళూరులో డ్రగ్స్ కనెక్షన్లో ఉన్నారు. డ్రగ్స్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా కోసం బెంగళూరు పోలీసులు శోధిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కి ఆదిత్య అల్వా బంధువు కావడం చేత 'వివేక్ ఒబెరాయ్ ఇంట్లో ఆదిత్య దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని..అందుకే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుండి ఒక బృందం వివేక్ ఇంటిపై దాడి చేసింది అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
కాగా కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) చిత్రనిర్మాతలకు మాదకద్రవ్యాలను సరఫరా చేసిన ఆరోపణలపై మొదట్లో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ సందర్భంలో, కన్నడ చిత్ర పరిశ్రమ నుండి కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రారంభంలో, నటి రాగిని ద్వివేది స్నేహితుడు రవిశంకర్‌ను అరెస్టు చేశారు. రవిశంకర్ విచారణ సమయంలో రాగిణి పేరు ప్రస్తావించారు. దాంతో రాగిణి ఇంటిపై దాడి చేసి ఆమెను అరెస్టు చేశారు.. దాంతో ఆమెను విచారించగా మరికొందరి పేర్లు వెల్లడించారు. ఈ క్రమంలో సంజన గల్రానీ పేరు కూడా ఉండడంతో ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.