Himachal Pradesh: హిమాచల్ కొత్త సీఎంగా సుఖ్విందర్, డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి
Himachal Pradesh: సీఎం, డిప్యూటీ సీఎం పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో CM అభ్యర్థిత్వంపై రెండు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. హిమాచల్ కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖునే సీఎం పదవి వరించింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పేరునే ఖరారు చేసింది. మరోవైపు డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి పేరును ప్రకటించింది. ఇద్దరు నేతలు రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసి తమ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. అంతకుముందు సీఎం ఎవరనే విషయంలో తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది. పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేశ్ అగ్నిహోత్రి ముగ్గురూ ఎవరికి వారే సీఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. వారి మద్దతుదారులు బలప్రదర్శనకు దిగడంతో సిమ్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్విందర్ సింగ్ పేరును సీఎంగా ఖరారు చేసింది. మరో నేత ముఖేశ్ అగ్నిహోత్రికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి సంతృప్తి పర్చింది.