Assam Train Derailed: పట్టాలు తప్పిన మరో రైలు.. వణికిస్తోన్న వరుస ఘటనలు

Update: 2024-10-17 15:19 GMT

Train Derailed in Assam: అగర్తలా - లోక్‌మాన్య తిలక్ టర్మినస్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. అస్సాంలోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలోని దిబలాంగ్ స్టేషన్ సమీపంలో ఇవాళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పవర్ కార్, ఇంజన్ సహా 8 బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. అగర్తలా నుండి ముంబైకి వెళ్తుండగా ఈ రైలు ప్రమాదం జరిగింది.

ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తుగా ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని సీఎం హిమంత తెలిపారు. సహాయ చర్యల్లో ముమ్మరం చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. రైల్వే శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకుంటున్నట్లు సీఎం హిమంత విశ్వ శర్మ వెల్లడించారు.

రైలు పట్టాలు తప్పిన ఘటనతో లుమ్డింగ్ - బదర్‌పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లను నిలిపేశారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే లుమ్డింగ్ డివిజన్ నుండి రైలు ప్రయాణికులు, క్షతగాత్రుల సహాయార్థం ఒక యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ని పంపించారు. అలాగే అదే రైలులో పారామెడికల్ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలానికి వెళ్లారు.

వణికిస్తోన్న వరుస ఘటనలు

గత వారం చెన్నైకి సమీపంలో మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. చెన్నై నుండి బయలుదేరిన రైలు కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటనే విషయం అక్కడి రైల్వే అధికారులకు ఒక మిస్టరీగా మారింది.

కవరైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద మెయిన్ ట్రాక్‌లో వెళ్లాల్సిన రైలు ఉన్నట్లుండి లూప్ లైన్‌లోకి ప్రవేశించి అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొంది. అప్పుడు రైలు గంటకు కనీసం 75 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. 12 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. ఈ రైలు ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడిలా అస్సాంలో మరో రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది.

జూన్ 1న ఒడిషాలో బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 293 మంది చనిపోగా మరో 1100 మందికి పైగా రైలు ప్రయాణికులు గాయపడ్డారు. రెండు రైళ్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఎన్నో కుటుంబాల్లో అయిన వారిని దూరం చేసింది.

Tags:    

Similar News