Mantralayam Raghavendra Swamy Temple: జూలై 2 న తెరుచుకోనున్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం
Mantralayam Raghavendra Swamy Temple: కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కొన్ని ఆలయాలను తెరచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ, మరి కొన్ని ఆలయాలు ఇంకా తెరచుకోకుండానే ఉన్నాయి. ఆ ఆలయాల జాబితాలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కూడా ఒకటి. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రెట్టింపు అవుతున్న నేపథ్యంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు ఇప్పటివరకు ఆచితూచి అడుగులు వేశారు. జులై 2వ తేదీ నుంచి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించినట్లు మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేవాదాయశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. పదేళ్లలోపు, 65 ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, కంటైన్‌మెంటు జోన్ల నుంచి వచ్చేవారు మినహా అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కొవిడ్ లక్షణాలు లేనివారినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అన్నవితరణ, ప్రసాదాల పంపిణీలు ప్రస్తుతానికి లేవన్నారు. ఆర్జిత సేవలు పరోక్షంగా నిర్వహిస్తామని, గర్భగుడి దర్శనాలు లేవన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దర్శనాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.