Ram Gopal Varma: పోలీసులను దౌడ్ తీయిస్తున్న రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కలేదు. ఆయన కోసం మూడు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చిక్కలేదు. ఆయన కోసం మూడు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేసన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు ఎం. రామలింగం రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 11న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య ఈ నెల 13న హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో కోరారు. అయితే ఈ నెల 19న విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. తనకు 4 రోజుల సమయం కావాలని మద్దిపాడు పోలీసులకు వాట్సాప్ లో మేసేజ్ పంపారు. ఈ నెల 25న కూడా విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు.
హైకోర్టులో చుక్కెదురు
మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ పై ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు వర్మకు సూచించింది. దీంతో మద్దిపాడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకున్నాయి.
గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో కేసులు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని గుంటూరు జిల్లాకు చెందిన నాయకులు ఎన్. రామారావు తుళ్లూరు పోలీసులకు ఈ నెల 13న ఫిర్యాదు చేశారు. మరో వైపు జనసేన, టీడీపీ నాయకులు ఫిర్యాదు మేరకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో నవంబర్ 21న విచారణకు రావాలని పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు.కానీ, ఈ విచారణకు ఆయన హాజరు కాలేదు.
వర్చువల్ విచారణకు సిద్దమన్న వర్మ
వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నానని రామ్ గోపాల్ వర్మ పోలీసులకు సమాచారం పంపారని ఆయన తరపు న్యాయవాది చెబుతున్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారని ఆయన ప్రకటించారు. తాము ఇచ్చిన నోటీసుల ప్రకారంగా విచారణకు హాజరుకాకపోవడంతో మద్దిపాడు పోలీసులు నవంబర్ 25న హైద్రాబాద్ కు వచ్చారు. అయితే వర్మ అందుబాటులో లేరు. షూటింగ్ నిమిత్తం కోయంబత్తూరుకు వెళ్లారని సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్మ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉంది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్మ కోసం మూడు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రామ్ గోపాల్ వర్మ గతంలో దౌడ్ అనే సినిమా తీశారు. ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా ఆయన దౌడ్ తీస్తున్నారు.
ముందస్తు బెయిల్ పిటిషన్లు
ప్రకాశం, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరుస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.