Pawan Kalyan's visit to Kankipadu mandal in Krishna district: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ నిధులతో కంకిపాడు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో ఉండగానే అక్కడ ఒక అపశృతి చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గొడవర్రు గ్రామానికి వచ్చిన ఓ బాలిక అక్కడి రద్దీ తట్టుకోలేక స్పృహ కోల్పోయారు.
పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఆ రద్దీ మధ్యలో బాలికకు ఊపిరాడలేదు. దీంతో బాలిక స్పృహ తప్పి కిందపడిపోయారు. అది గమనించిన బాలిక తండ్రి వెంటనే ఆ చిన్నారిని తన బైకుపైనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ రద్దీ మధ్యలో వెళ్లడం కూడా ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? - ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
మరోవైపు పవన్ కళ్యాణ్ కంకిపాడు మండలం గుడవర్రు గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బి శాఖ ఇంజనీర్లతో కలిసి రోడ్డు మందం, నాణ్యత, పనితీరును తెలుసుకునేందుకు రోడ్డుపైనే ఒక పక్కన చిన్న గొయ్యిని తవ్వి పరిశీలించారు.
రోడ్ కాంట్రాక్టర్స్ రోడ్డు నిర్మాణంలో అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అభివృద్ధి పనులు, నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడకూడదని అధికారులకు కూడా సూచించారు.
ఆ తరువాత సురక్షిత మంచి నీటి వ్యవస్థను కూడా పరిశీలించారు.
అంతకు ముందు మన్యంలో..
పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. కృష్ణా జిల్లా పర్యటనకు ముందుగా విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాల్లో పర్యటించారు. బాగుజోల వద్ద రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 49 కోట్ల నిధులతో 48 కిమీ పొడవుతో చేపట్టే రోడ్డు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి గిరిజన గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదని తను 2018 లో అక్కడ పర్యటించినప్పుడు తెలుసుకున్నానని, అందుకే అక్కడ రోడ్డు వేయించేందుకు వచ్చానని చెప్పారు. ఇకపై ప్రతీ 2 నెలలకు ఒకసారి మూడు రోజుల పాటు ఈ మన్యం గ్రామాల్లోనే ఉంటూ ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.