Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు..ఏడుగురు దుర్మరణం
Road Accident: తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు మరణించారు. ఏపీలోని సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మినీ వ్యాన్ లో 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరణించినవారంతా గుడిబండ, అమరాపురం మండలాలకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. దేవరకొండ పట్టణ శివారులోని పెద్ద దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. స్వీట్ షాపులోకి డీసీఎం వ్యాను దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.