AP Rains: దూసుకోస్తున్న తీవ్ర అల్పపీడనం..పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకువస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతంరం చెందింది. దీంతో రాబోయే 24 గంటల్లో వాయవ్యదిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు మళ్లుతుంది. తర్వాత కోస్తా తరం వెంబడి కదులుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. గురువారం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని..శ్రీకాకుళం, అల్లూరి సీతారామారాజు, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్య కారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఇక రాష్ట్రంలోని బాపట్ల, ఏలూరు, తిరుపతి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ పరిస్థితుల మేరకు నవంబర్, డిసెంబర్ లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలాఖారుకు అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పాడనున్నట్లు సూచిస్తోంది.