AP Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..ఏపీలోకి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన
AP Rains: ఏపీకి భారీ వర్ష ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రేపు ( మంగళవారం) నాటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడోనెంబర్ హెచ్చరికను జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీని కదలికలను అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అల్పపీడన అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలపై వైపు పయనిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకుందని ఇలాంటివి అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు. గురువారం వరకు దీని ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే అల్పపీడనం తీరానికి చేరువగా వెళ్తుందా లేదా తీరం దాటుతుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.