TGSRTC Buses for Telangana and AP routes in Sankranthi 2025 Season: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిటీ వాసులు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగను బాగా జరుపుకుంటారు. దీంతో హైదరాబాద్‌లో ఉండే ఏపీ ప్రజలు ముందే టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. సీట్లు దొరకవనే ఉద్దేశంతో ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో రిజర్వేషన్‌కు రద్దీ పెరిగిందని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు.
సిటీ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు వంటి రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3 వేలకు పైగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ఏపీలోని పలు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉండడంతో దాదాపు సగం మంది రైళ్లల్లో వెళ్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా ఏపీలోని సొంతూళ్లకు రైలు సౌకర్యం ఉన్న ప్రాంతాలకు జనం రైళ్లలో వెళ్లడం ప్రతీ ఏడాది కనిపించే ట్రెండే. అయినప్పటికీ గతేడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా బస్సులు పెంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు టిజిఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు (TGSRTC Buses).
ఇక తెలంగాణ విషయానికొస్తే... హైదరాబాద్ నుంచి తెలంగాణలోని కరీంనగర్ వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. దీంతో ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. అందుకే రైలు మార్గం లేని రూట్లను గుర్తించి ఆయా రూట్లలో బస్సులను పెంచనున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయనుండటంతో ఈసారీ రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి సమాచారం తెప్పించుకుని దానికి అనుగుణంగా అదనపు బస్సులు (Buses for Telangana and AP in Sankranthi 2025) ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.