Tirumala: తిరుమల శ్రీవారికి విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా శ్రీవారికి మరో భక్తుడు భారీగా విరాళం అందించారు. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి 10వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు ఈ విరాళాన్నిఅందజేశారు.
ఈ మేరకు తిరుపతిలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి దాత సూర్య పవన్ కుమార్ డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను ఈవో, అదనపు ఈవో అభినందించారు. తిరుమల శ్రీవారికి భక్తులు తమకు తోచిన మొత్తంలో విరాళాలు, కానకలను అందిస్తుంటారు.
మద్రాసుకు చెందిన భక్తులు తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి బంగారు కిరీటం అందించారు. తిరుపతికి 110కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలో తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం బంగారు కిరీటం విరాళంగా అందించారు.
చెన్నైకి చెందిన వసంత లక్ష్మీ, ఆమె కుమార్తె మాధవి, అల్లు మనోహర్ రూ. 27లక్షల విలువైన 341 గ్రాముల బంగారు కరీటాన్ని లక్ష్మీ నరసింహ స్వామికి సమర్పించారు. ఆలయ సూపరింటెండెంట్ ముని బాలకుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ డి క్రిష్ణమూర్తి, అసిస్టెంట్ నాగరాజు, ఆలయ అర్చకులు గోపాల భట్టార్, క్రిష్ణప్రసాద్ భట్టార్, గోకుల్, అనిల్ కుమార్ విరాళాన్ని స్వీకరించారు. దర్శనం అనంతరం దాతలకు పండితులు వేదశీర్వచనం చేశారని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.