ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: రేసులో వీరే...

Rajya Sabha Candidates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దక్కనున్నాయి. ఈ మూడు స్థానాలకు ఈసీ నవంబర్ 26న షెడ్యూల్ ను ప్రకటించింది.

Update: 2024-11-27 09:52 GMT

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: రేసులో వీరే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దక్కనున్నాయి. ఈ మూడు స్థానాలకు ఈసీ నవంబర్ 26న షెడ్యూల్ ను ప్రకటించింది. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ మూడు స్థానాల్లో రెండు స్థానాలకు నాలుగేళ్ల పదవి కాలం ఉంది. ఒక్క స్థానానికి రెండేళ్లు మాత్రమే కాలపరిమితి ఉంది.

వైఎస్ఆర్ సీపీకి నో ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 మంది ఎమ్మెల్యేలు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క రాజ్యసభ సభ్యుడి గెలవాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. వైఎస్ఆర్ సీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం 11 మంది మాత్రమే. దీంతో రాజ్యసభ రేసులో ఆ పార్టీ నిలిచే అవకాశం లేదు. మూడు స్థానాలు కూటమి ఖాతాలో పడతాయి. అయితే మూడు స్థానాల్లో మూడు పార్టీలు పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నాలుగేళ్ల పదవి కాలం ఉన్న సీటుపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి.

రాజ్యసభ రేసులో వీరే...

తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ రేసులో పలువురు నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, సానా సతీష్ ల పేర్లు కూడా టీడీపీ నుంచి ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ సంబంధాలు పునరుద్ధరణలో కంభంపాటి రామ్మోహన్ రావు కీలకంగా వ్యవహరించారని...ఆయనకు ఎంపీ పదవి దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

గతంలో కూడా ఆయనకు ఎంపీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. అయితే సామాజిక సమీకరణాలతో ఆయన ఈ చాన్స్ మిస్సయ్యారు. వరుసగా రెండుసార్లు గుంటూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన గల్లా జయదేవ్ రాజ్యసభ రేసులో ఉన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు సానా సతీష్ పేరు కూడా రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. జనసేన నుంచి నాగబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.

రాజ్యసభలో  టీడీపీకి లేని ప్రాతినిథ్యం

ఆంధ్రప్రదేశ్ లో 2019లో టీడీపీ అధికారానికి దూరమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. అందులో కొందరు వైఎస్ఆర్ సీపీ వైపు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం తగ్గిపోవడంతో రాజ్యసభ నుంచి టీడీపీ సభ్యులు రిటైరైనా కొత్తవారిని పంపించే అవకాశం ఆ పార్టీకి దక్కలేదు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత 40 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోవడం ఇదే తొలిసారి. వైఎస్ఆర్ సీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే ఇందులో ముగ్గురు రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ బలం ఎనిమిదికి పడిపోయింది. ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News