AP Social Media War: జగన్ ఉక్కిరి బిక్కిరి
AP Social Media War: జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారా.. ముప్పేట దాడిలో ఊపిరి సలపని టెన్షన్‌కు గురువుతున్నారా.. కోటలో రాజును కొట్టాలంటే ముందుగా సైన్యాన్ని కొట్టాలి.. ఆ తరువాత సైన్యాధిపపతి, మంత్రి, తనకు అండదండలుగా ఉన్న రాజప్రసాదంలోని వ్యూహకర్తలను కొట్టాలి.. అయిదునెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇపుడు అదే చేస్తుంది. అసలు టార్గెట్ జగన్ .. ఇదే ఈ రోజు ట్రెండింగ్ స్టోరీ.
AP Social Media War: జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారా..ముప్పేట దాడిలో ఊపిరి సలపని టెన్షన్ కు గురువుతున్నారా..కోటలో రాజును కొట్టాలంటే ముందుగా సైన్యాన్ని కొట్టాలి..ఆ తరువాత సైన్యాధిపపతి, మంత్రి, తనకు అండదండలుగా ఉన్న రాజప్రసాదంలోని వ్యూహకర్తలను కొట్టాలి.. అయిదునెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇపుడు అదే చేస్తుంది. ఏపీలో అసలేం జరుగుతోంది? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి?
జగన్ అనే టార్గెట్ ను చేధించాలంటే ముందుగా ఆయన వీరవిధేయుల సంగతి చూడాలి. జగన్ మీద దోమ వాలిందన్న కోపంతో తమపైకి రాళ్లు విరిసిన వారి సంగతి చూడాలి..సోషల్ మీడియా, మీడియా సమావేశాల వేదికగా తమపై పచ్చి బూతు పురాణాలు చదివిన వారి పనిబట్టాలి.. ఇపుడు కూటమి ప్రభుత్వం అదే చేస్తోంది. రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్క పేజీ తిరగేస్తోంది..
టార్గెట్ సజ్జల రామకృష్ణా రెడ్డి
మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలులో ఉన్నారు. రాజకీయాలకు సెలవంటూ పోసాని కృష్ణ మురళి ఓ నమస్కారం పెట్టారు. రాంగోపాల్ వర్మ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.. తప్పయిపోయింది క్షమించమంటూ శ్రీరెడ్డి బతిమిలాడారు. కూటమికి కావాల్సింది ఇదే.. జగన్ తరపున విరుచుకుపడ్డ మొనగాళ్లందరి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి.. జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళు అన్నీ తానై వెలిగి సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డిని చంద్రబాబు సర్కార్ టార్గెట్ చేసిందని వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియాను నడిపిన సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.జగన్ అడుగుల్లో అడుగై నడిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తాజాగా ఫోక్సో కేసు నమోదయింది. వర్రా రవీంద్ర రెడ్డి, ఇంటూరి రవికిరణ్, బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి.
అందరి చూపు కొడాలి , వంశీపైనే
పెద్ద తలకాయల్లో ఇక మిగిలింది కొడాలి నాని, వల్లభనేని వంశీ..నానిపై ఇప్పటికే విశాఖలో కేసు నమోదయింది.. వల్లభనేని వంశీ సబ్జెక్ట్ రెడ్ బుక్ లో సపరేట్ చాప్టర్ గా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒకప్పుడు వైసీపీ ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్ ను అరెస్ట్ చేయటం ద్వారా జగన్ హయాంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై తమ వైఖరి ఎలా ఉండబోతుందో కూటమి సర్కార్ సంకేతాలు పంపించింది.
సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైరైన తరువాత కూడా జగన్ సర్కారు ఆయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఓఎస్ డీ హోదా కల్పించింది. కూటమి సర్కారు వచ్చిన తరువాత కూడా గడిచిన అయిదు నెలల్లో ఆయనను విచారణ చేయటానికి కిందిస్థాయి అధికారులు సాహసించలేదు.
విజయ్ పాల్ అరెస్టుతో
చివరకు ఎంక్వయిరీ ఆఫీసర్ గా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ను నియమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను తిరస్కరించాక ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పోలీస్ శాఖలోనూ సంచలనం కలిగిస్తోంది. విజయపాల్ ను విచారణ చేయటం ద్వారా రఘురామకృష్ణంరాజు కేసు డొంకను పూర్తిగా కదిలించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
అప్పటి సీఐడి ఉన్నతాధికారి పీవీ సునీల్ కుమార్ కనుసన్నల్లోనే విజయపాల్ పనిచేశాడని ఆరోపణలున్నాయి. రఘరామకృష్ణంరాజు ఆరోపించినట్టు ఒక రాత్రంతా లాఠీలు, రబ్బరు బెల్టులతో కొట్టటం, సీసీ కెమెరాల ద్వారా వాటిని అప్పటి సీఎం చూసేలా చేయటం లాంటి విషయాలు నిజమేనని విచారణ తేలితే ఈ కేసులో పెద్ద తలకాయలను సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అదే జరిగితే అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు.
అదానీ కేసు.. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే..
ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న అదాని ఆర్ధిక కుంభకోణం కేసులో జగన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఎలా డీల్ చేయాలనే విషయంలో కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. విద్యుత్ ఒప్పందాల కోసం నాలుగు రాష్ట్రాలకు అదాని భారీగా లంచాలు ఇచ్చినట్టు అమెరికా ఆరోపించింది. ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందాల కోసం అదాని ఏకంగా 1750 కోట్లను జగన్ కు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో జగన్ పై విచారణ చేయించేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందే తప్ప అడుగు ముందుకు వేయటం లేదు. ఈ నేపథ్యంలో జగన్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం వచ్చినా కూటమి సర్కారు మాత్రం ఢిల్లీ నుంచి అందే సంకేతాల ఆధారంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా జగన్ ఉక్కిరి బిక్కిరయ్యేలా ముప్పేట దాడి చేసేందుకు కూటమి సర్కారు సిద్దమైంది. ఇపుడు మరింత స్పీడ్ పెంచింది. మరి, చంద్రబాబు అధికార చాతుర్యాన్నీ, అష్ట దిగ్బంధనాన్ని తట్టుకుని జగన్ నిలబడగలుగుతారా.. పార్టీ పునాదులు దెబ్బతినకుండా కాపాడుకాపాడుకోగలుగుతారా.. వెయిట్ అండ్ సీ