US Presidential Debate: వివేక్ ఆరోపణలు.. మౌనంగా ఉండిపోయిన నిక్కీ హేలీ
US Presidential Debate: బిలియనీర్ రీడ్ హోఫ్మన్ నుంచి నిక్కీ 2.5 లక్షల డాలర్లు లబ్ధిపొందారు
US Presidential Debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన నాలుగో విడత చర్చా కార్యక్రమం వాడీవేడిగా జరిగింది. దీనిలో నలుగురు అభ్యర్థులూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ , వివేక్ రామస్వామితోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పాల్గొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి కూడా చర్చకు డుమ్మా కొట్టి, నిధుల సమీకరణ కోసం ఫ్లోరిడాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
యూనివర్శిటి ఆఫ్ అలబామాలోని మూడీ మ్యూజిక్ హాలులో జరిగిన చర్చలో నిక్కీ హేలీనే లక్ష్యంగా వివేక్ రామస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె అవినీతిపరురాలని, మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు తీసుకుని ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చే రీడ్ హోఫ్మన్ అనే బిలియనీర్ నుంచి నిక్కీ, ఆమె కుటుంబం 2.5 లక్షల డాలర్లు లబ్ధి పొందారని వివేక్ ఆరోపించారు.
గత మూడు చర్చా కార్యక్రమాల్లో వివేక్‌కు దీటుగా బదులిచ్చిన నిక్కీ .. ఈ విడత చర్చలో చాలాసేపు మౌనంగానే ఉండిపోయారు. ఒక దశలో ఆమెకు మద్దతుగా మరో అభ్యర్థి క్రిస్ క్రిస్టీ వివేక్‌పై విరుచుకుపడ్డారు.