Karthik Naralasetty: టెక్సాస్ ఎన్నికల బరిలో తెలుగు యువకుడు.. ఎవరీ కార్తీక్ నరాలశెట్టి?
Karthik Naralasetty: కార్తీక్ నరాలశెట్టి టెక్సాస్ లోని 'ది హిల్స్' మేయర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
Karthik Naralasetty: కార్తీక్ నరాలశెట్టి టెక్సాస్ లోని 'ది హిల్స్' మేయర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. నవంబర్ 5న జరిగే ఎన్నికలపై ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన కార్తీక్ అమెరికాలో వ్యాపారం చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ఆయన ఈ ఏడాది ఆగస్టు నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పారిశ్రామికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో ది హిల్స్ ను అభివృద్ధిచేస్తానని కార్తీక్ ప్రచారం చేస్తున్నారు.
సోషల్ బ్లడ్ పేరుతో ఎన్ జీ ఓ సంస్థ
కార్తీక్ దిల్లీలో చదువుకున్నారు. అక్కడి నుంచి అమెరికా న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ పూర్తి చేశారు. సోషల్ బ్లడ్ పేరుతో ఎన్ జీ ఓ సంస్థను ఏర్పాటు చేశారు. రక్తదాతలను ఒకవేదికపైకి తెచ్చేందుకు ఈ సంస్థ పనిచేసింది. అమెరికాలోనే వ్యాపారంలోకి దిగారు. ఈ సమయంలోనే ఆయనకు అదితి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెను ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
ది హిల్స్ లో భారత సంతతి కుటుంబాలు ఐదే
ది హిల్స్ లో భారతి సంతతికి చెందిన కుటుంబాలు ఐదు మాత్రమే. ఇక్కడ 2 వేల జనాభా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాజకీయాల్లోకి చేరి ప్రజలకు సేవ చేయాలని కార్తీక్ భావించారు. దీంతో ఆయన మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. దీని కోసం పద్దతి ప్రకారంగా ప్రచారం ప్రారంభించారు. ట్రాన్స్ పరెన్సీ ఈజ్ ద గేమ్, కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే ది హిల్స్ మేయర్ పదవికి ఎన్నికైన అతి చిన్న వయస్సున్నవాడిగా రికార్డు సృష్టించనట్టు అవుతోంది.