Trump: ట్రంప్‌నకు దిమ్మతిరిగే షాకిచ్చిన న్యూయార్క్ కోర్టు..హష్ మనీ కేసు తిరస్కరణ
Trump: అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు న్యూయార్క్ కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. పోర్న్ స్టార్ కు హష్ మనీ వ్యవహారంలో ట్రంప్ పై నమోదు అయిన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్ హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ తెలిపారు. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్ కు రక్షణ వర్తించదన స్పష్టం చేశారు.
హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషీగా తేలారు. ఈ ఏడాది నవంబర్ లో న్యూయార్క్ కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కొకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షణను వాయిదా వేసింది.
తాజాగా ట్రంప్ నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తెలిపింది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కేసులో ట్రంప్ నకు ఊరట లభించకపోతే..శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది.
పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారన్న ఆరోపణలు వచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె బయటకు ఎలాంటి విషయాలు చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30లక్షల డాలర్ల హష్ మనీని ఇప్పించారన్న ఆరోపణ ఉంది. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని..అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగంగా ఉంది. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు ఉన్నాయి. ఆరు వారాత విచారణ తర్వాత ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు చెప్పింది. ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాగ్మూలం కూడా ఇచ్చారు. ఆమెతోపాటు మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.