India-Russia relations: ఆ 2 మిస్సైల్స్ కూడా త్వరగా పంపించండి - పుతిన్‌తో రాజ్‌నాథ్ సింగ్
India-Russia relations: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్‌కు అక్కడి భారత రాయబారి వెంకటేష్ కుమార్, రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ నుండి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలోనే రాజ్‌నాథ్ సింగ్‌కు పుతిన్‌కు మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుతిన్‌తో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ - రష్యా మధ్య సంబంధాలు ఎత్తైన శిఖరం కంటే ఎత్తైనవి, లోతైన సముద్రం కంటే లోతైనవి అని అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఎంత బలమైనవో చెప్పడానికి ఉదాహరణగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మిలిటరీ, మిలిటరీ కోపరేషన్‌పై జరిగిన ఇండియా-రష్యా ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్ 21వ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, వ్లాదిమిర్ పుతిన్ (Rajnath Singh meets vladimir Putin) పాల్గొన్నారు. రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రి బెలోసోవ్ కూడా ఈ భేటీలో ఉన్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతో మరిన్ని సానుకూల ఫలితాలు సాధించవచ్చని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
రష్యా-భారత్ మధ్య అగ్రనేతల వరుస పర్యటనలు
భారత్-రష్యా మధ్య స్నేహభావం ఎన్నో ఏళ్లదని, ఆ స్నేహం భవిష్యత్తులోనూ అలాగే కొనసాగిస్తామని రాజ్‌నాథ్ సింగ్ పుతిన్‌తో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తరపున పుతిన్‌కు రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. సరిగ్గా 5 నెలల క్రితమే ప్రధాని మోదీ రష్యాలో పుతిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అక్టోబర్ నెలలోనూ బ్రిక్స్ దేశాల సదస్సు కోసం ప్రధాని మోదీ మరోసారి రష్యాలో పర్యటించారు. ఇక వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వార్షిక సదస్సు చర్చల కోసం పుతిన్ కూడా భారత్‌లో (Putin to visit India) పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న అగ్రనేతల వరుస పర్యటనలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజా సమావేశంపై రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో పుతిన్‌తో భేటీ అవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. నేలపై నుండి నింగీలోని లక్ష్యాలను ఎక్కుపెట్టే ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్స్‌ను (S-400 Triumf surface-to-air missile systems) రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తోంది. వీటికి సంబంధించి మరో రెండు యూనిట్స్ ఇంకా రావాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఆ రెండు యూనిట్స్‌ను కూడా సరఫరా చేయాల్సిందిగా రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలోసోవ్‌ను రాజ్‌నాథ్ సింగ్ కోరారు.
S-40 ట్రయంఫ్ సర్‌ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ శక్తిసామర్థ్యాలు
2007 లో రష్యా తొలిసారిగా ఈ ఎస్-40 ట్రయంఫ్ సర్‌ఫేస్ టు ఎయిర్ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్‌ను ప్రవేశపెట్టింది. ఆకాశంలో శత్రువుల కదలికలు 400 కిమీ దూరంలో ఉండగానే వాటిని పసిగట్టి కూల్చగల శక్తిసామర్థ్యాలు ఈ మిస్సైల్స్ సొంతం. 2018 లో రష్యాతో భారత్ 5.4 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పటికే మూడు ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్స్ సిస్టమ్స్‌ను రష్యా భారత్‌కు పంపించింది. భారత్ ఈ మిస్సైల్స్ సిస్టమ్స్‌ను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో (India's borders with China and Pakistan) మొహరించింది.