Anechoic Chamber: ఈ గదిలో ఉంటే మీలో రక్తం ప్రవహిస్తున్న చప్పుడు కూడా స్పష్టంగా వినిపిస్తుంది

Anechoic Chamber: అసలు ఏ మాత్రం చప్పుడు లేన ప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. అది ఎంత నిశ్శబ్దమైన ప్రదేశం అంటే, అక్కడ ఉంటే మీ గుండె చప్పుడు మీకు స్పష్టంగా వినిపిస్తుంది.

Update: 2025-01-09 09:20 GMT

Anechoic Chamber: ఈ గదిలో ఉంటే మీలో రక్తం ప్రవహిస్తున్న చప్పుడు కూడా స్పష్టంగా వినిపిస్తుంది

Anechoic Chamber: అసలు ఏ మాత్రం చప్పుడు లేని ప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. అది ఎంత నిశ్శబ్దమైన ప్రదేశం అంటే, అక్కడ ఉంటే మీ గుండె చప్పుడు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఊపిరితిత్తులు సంకోచిస్తూ, వ్యాకోచిస్తున్న శబ్దం కూడా వినిపిస్తుంది. ఇంకా, చెప్పాలంటే మీ శరీరంలో రక్తం ప్రసరిస్తున్న చప్పుడు కూడా వినిపించేంత సైలెంట్ ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి ప్రదేశం ఒకటి ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా?

రండి... ఈ భూమి మీద అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశానికి మీకు స్వాగతం. ఇక్కడ చాలా మంది అరగంట కూడా ఉండలేకపోయారు. ఈ గదిలోకి అడుగుపెడితే నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఈ గది గోడలన్నీ మెత్తని ఫోమ్ వంటి పలకలతో కవర్ చేశారు. లైటింగ్ డిమ్ గా ఉంటుంది. లోపల కూర్చోవడానికి కుర్చీల్లాంటివి కూడా ఏమీ ఉండవు.

ఈ గదిని అనెకోయిక్ చాంబర్ అంటారు. వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఈ గదిని నిర్మించారు. భూమి మొత్తం మీద అత్యంత సైలెంట్ రూమ్‌గా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. టెక్నికల్ గా చెప్పాలంటే, ఈ గదిలో సౌండ్ లెవెల్ మైనస్ 20.35 డెసిబెల్స్. ఇది శ్వాస చప్పుడు కన్నా చాలా రెట్లు తక్కువ.

ఈ గదిలో గోడలు, పైకప్పులకు అమర్చిన స్పాంజి అకాస్టిక్స్ 99.99 శాతం శబ్దాన్ని అబ్సార్బ్ చేసుకుంటాయి. చిన్న ప్రకంపన కూడా ఈ గదిలో పుట్టదు. అలాంటి ఈ సౌండ్ ప్రూఫ్ గదిలోకి వెళితే మన వినికిడి శక్తే అయోమయానికి గురవుతుంది.

ఈ గదిలోకి అడుగు పెట్టడమంటే మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడమే. ఈ గదిలోకి వెళ్ళగానే మన శరీరం చేసే చప్పుడు మనకు భీకరంగా వినిపిస్తుంది. మనం ధరించిన దుస్తులు ఏ కాస్త కదిలినా గరగరమనే శబ్దం విని భయపడిపోతాం. అంతెందుకు, నెమ్మదిగా అడుగులు వేస్తున్నా.. కీళ్ళు కదులుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అతి సూక్ష్మ ధ్వని కూడా ఈ గదిలో ఎన్నో రెట్లు పెరిగినట్లు స్పష్టంగా వినిపిస్తుంది. అందుకే, ఈ గదిలో ఎంత ఎక్కువసేపు ఉంటే మన సెన్సెస్ మీద అదుపును మనం అంత ఎక్కువగా కోల్పోతాం. కొంతమందికి ఇందులోకి వెళ్ళగానే మత్తు ఆవహిచింది. మరికొందరు స్పృహ కోల్పోయి పడిపోయారు. కొందరు ఎవేవే భ్రమల్లోకి జారుకున్నారు.

అలాంటి అత్యంత సైలెంట్ రూమ్ ను ఎందుకు తయారు చేశారు? ఏదో గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం అనుకుంటే పొరపాటే! ఈ చాంబర్‌ను అల్ట్రా సెన్సిటివ్ ప్రాడక్ట్స్ ను చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. మైక్రో ఫోన్స్, స్పీకర్స్, హియరింగ్ ఎయిడ్స్ వంటి వాటిని ఈ గదిలో చెక్ చేస్తారు. అవి టెక్నికల్ గా ఎంత కరెక్టుగా ఉన్నాయన్నది ఈ గదిలోనే నిర్ధారిస్తారు. అంతేకాదు, మనుషులకు, టెక్నాలజీకి, ధ్వనికి ఉన్న సంబంధం ఏమిటన్నది పరిశోధించడానికి కూడా ఈ గదిని ఉపయోగిస్తున్నారు.

మరి ఇలాంటి గదిలోకి వెళ్ళి ఎవరైనా ఎలా ఉంటారు?

చాలా మంది తమ గుండె చప్పుడును, శ్వాస చప్పుడును అంత స్పష్టంగా వినలేక భయపడిపోయి రెండు మూడు నిమిషాలకే ఆ గదిలోంచి బయటకు వచ్చేశారు. మీరైతే ఆ గదిలో ఎంత సేపు ఉండగలరు? అంతటి నిశ్శబ్దాన్ని ఎంత సేపు భరించగలరు? మీ ఆన్సర్ కింద కామెంట్స్‌లో రాయండి. 

Full View


Tags:    

Similar News