HMPV Virus: చైనాను వణికిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
HMPV Virus: చైనాను మరో వైరస్ వణికిస్తోంది.హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV) అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
HMPV Virus: చైనాను మరో వైరస్ వణికిస్తోంది.హ్యుమన్ మెటానిమోవైరస్ (HMPV) అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పలు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్ తో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. ఈ వైరస్ కు తోడు ఇన్ ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ కొత్త వైరస్ కు సంబంధించి చైనా ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
హెచ్ఎంపీవీ అంటే ఏంటి?
హ్యుమన్ మెటానిమోవైరస్ HMPV అనేది సాధారణ జలుబు తరహా లక్షణాలను కలిగించే ఓ వైరస్. ఈ వైరస్ సోకితే దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ముక్కు కారుతుంది. గొంతు నొప్పికి కూడా కారణమౌతోంది. చిన్నపిల్లలు, వృద్దుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ త్వరగా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హెచ్ఎంపీవీ లక్షణాలు
ఈ వైరస్ సోకినవారికి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇది కొన్నిసార్లు న్యుమోనియా , ఆస్తమా వంటి వాటికి కూడా దారితీసే అవకాశం ఉందని కీవ్ ల్యాండ్ క్లినిక్ నివేదిక వెల్లడించింది.ఇది మూడు నుంచి ఆరు రోజుల్లో మనిషిపై తన ప్రభావాన్ని చూపుతోంది.దీని ప్రభావంతో బ్రోంకటీస్ లేదా న్యుమోనియాకు కూదా దారితీసే అవకాశం ఉందని అమెరికా సీడీసీ అధ్యయనాలు వెల్లడించాయి. ప్రధానంగా ఈ వైరస్ శ్వాసకోశ సమస్యలకు కారణమౌతోంది. తరచు చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ ను ఉపయోగించాలి.లేకపోతే గాలి ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.
HMPVకి వ్యాక్సిన్ ఉందా?
ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఎలాంటి వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. జ్వరం, జలుబు లక్షణాలు తగ్గించేందుకు అందుబాటులో ఉన్న మందులను వాడుతారు. ఈ వైరస్ లక్షణాలు కోవిడ్-19 వైరస్ లక్షణాలను పోలి ఉన్నాయి. 2024 ఏప్రిల్ వైరాలజీ జర్నల్ అధ్యయనం మేరకు కోవిడ్ తర్వాత చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరిగాయి. 2023 జూన్ 5 నుంచి 2024 ఏప్రిల్ 29 మధ్య ప్రతి రోజూ హెచ్ఎంపీవీ ఇన్ ఫెక్షన్లను గుర్తించారు. దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.