HMPV Virus: చైనాలో పిల్లులకు కొత్త వైరస్..కోవిడ్ మాత్రలు వేస్తున్న యజమానులు
HMPV Virus: చైనాలో హెచ్ఎంపీవీ మహమ్మారి గడగడలాడిస్తోంది. చైనాలో పిల్లులు ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్ అనే ప్రాణాంతక వైరస్ వ్యాధి బారినపడుతున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తమ పెంపుడు పిల్లులు ఈ వ్యాధి బారినపడుకుండా ఉండేందుకు చాలా మంది తమ పిల్లులకు మనుషుల్లో కోవిడ్ వైద్యానికి వాడే మందులు వేస్తున్నట్లు స్థానిక మీడియాలో కథలు వెలువడుతున్నాయి.
ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెరిటోనిటిస్ అనేది ఒక వైరల్ వ్యాధి. దీనిని ఫీలైన్ కరోనావైరస్ అని కూడా పిలుస్తుంటారు. ఇది పిల్లులకు మాత్రమే సోకుతుంది. ఈ వైరస్ పిల్లి శరీరం అంతటా వ్యాపించే ముందు తెల్లరక్త కణాలకు సోకుతుంది. దీనికి వాడే మందులు చాలా ఖరీదైనవి. దీంతో వాటికి బదులుగా దీనిపై కొన్ని కోవిడ్ యాంటీ వైరల్ మందులు ప్రభావం చూపుతాయని ఓ అధ్యయనంలో తేలినట్లు పలు కథనాలు చెబుతున్నాయి.
దీంతో అక్కడి ప్రజలు వారి పెంపుడు పిల్లుల కోసం కోవిడ్ మందులను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ మందులను పిల్లులకు వాడుతున్నప్పుడు వాటి పరిస్థితి మెరుగవుతుండడం తాము గమనించామని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా ఈ చర్యలను మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మానవులకు వాడే ట్యాబ్లెట్లను పిల్లులకు వాడటం వల్ల వాటి ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నట్లు అవుతుందని విమర్శిస్తున్నారు.
చైనాలో హ్యుమన్ మెటానిమోవైరస్ అనే మరోవైరస్ వ్యాప్తి చెందుతోందని ప్రజలు పెద్దఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కడుతున్నారని పలు వార్త సంస్థలు చెబుతున్నాయి. దీని లక్షణాలు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవంలో ఇబ్బంది కనిపిస్తుంది.