Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న లిబరల్ పార్టీతోపాటు ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకునే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనలు వస్తున్నాయి. నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా జస్టిన్ ట్రూడో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీతోపాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ట్రూడో కార్యాలయం స్పందిస్తేనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చాలా కాలంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. జస్టిన్ ట్రూడో తీసుకున్న పలు నిర్ణయాలపై లిబరల్ పార్టీకి చెందిన పలువురు నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కెనడియన్ వార్తాపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ జస్టిన్ ట్రూడో సోమవారం తన రాజీనామాను ప్రకటించవచ్చని పేర్కొంది.
ది గ్లోబ్ అండ్ మెయిల్ ప్రకారం, ఇటీవలి ఒపీనియన్ పోల్ ఆయన పార్టీ పియరీ పోయిలీవ్రే కన్జర్వేటివ్ పార్టీ కంటే వెనుకబడి ఉందని తేలింది. ట్రూడో తన రాజీనామాను ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే బుధవారం జరిగే నేషనల్ కాకస్ సమావేశానికి ముందు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలగవచ్చని భావిస్తున్నారు.