Earthquake Death toll: భూకంపంలో 100 కు చేరిన మృతుల సంఖ్య... భారత్‌లోనూ భూకంపం ప్రభావం
Death toll in Tibet Earthquake: టిబెట్‌లో భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 100 కు పెరిగిందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. మరో 130 మందికి పైగా గాయపడ్డారని ఆ వార్త సంస్థ తెలిపింది. టిబెట్-నెపాల్ బార్డర్‌లో ఈ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.1 గా ఉన్నట్లు భూకంపాలకు సంబంధించిన జాతీయ అధ్యయన కేంద్రం వెల్లడించింది. భారత్‌లోని అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోనూ భూమి కంపించింది.
టిబెట్ రాజధాని లాసాకు 400 కిమీ దూరంలోని టింగ్రిలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. టింగ్రి నేపాల్ సరిహద్దుల్లో మౌంట్ ఎవరెస్ట్ పర్వతానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ చూసేందుకు వచ్చే పర్యాటకులతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
అందుకే ఎక్కువ నష్టం వాటిల్లింది
మంగళవారం ఉదయం 6.35 గంటలకు టిబెట్, నెపాల్ సరిహద్దుల్లో తొలిసారిగా భూకంపం సంభవించింది. ఆ తరువాత కొద్ది తేడాతో మరో రెండుసార్లు భూమి కంపించింది. భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉండటం, మొత్తం మూడుసార్లు భూమి కంపించడంతో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. భవనాలు కుప్పకూలడంతో వాటికింద చిక్కుకున్నజనం ప్రాణాలు కోల్పోయారు. చలికాలం అవడం, అందులోనూ అప్పుడే తెలతెల్లవారుతున్న సమయం కావడంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. అలాంటి సమయంలో భూకంపం సంభవించడం, భవనాలు శిథిలమవడంతో కొంతమంది జనం ఆ శిథిలాల కిందే చిక్కుకున్నారు.
టిబెట్ రక్షణ బలగాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. శిథిలాలు తొలగించి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అదే క్రమంలో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కూడా వెలికి తీస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు మృతుల సంఖ్య పెరుగుతోంది ( Tibet Earthquake latest news updates ).