Who is Anita Anand: జస్ట్ 6 ఏళ్ల అనుభవంతోనే కెనడా పీఎం రేసులో అనితా ఆనంద్.. ఎవరీ అనిత?
Who will be the Canada next PM: అనితా ఆనంద్... ఇప్పుడు కెనడాలో ఎక్కువగా వినిపిస్తోన్న ఇండో కెనడియన్ మహిళ పేరు ఇది. ఎందుకంటే కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తరువాత ప్రధాని రేసులో ఉన్న వారిలో ఆమె కూడా ఒకరు. ప్రధాని పదవి అంటే తలపండిన నేతలు లేదా బాగా అనుభవం ఉన్న నాయకులకే ఆ ఛాన్స్ దక్కుతుందనే అభిప్రాయం ఉంది. కానీ అనితా ఆనంద్ 2019 లోనే రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఆమె అప్పుడే ప్రధాని రేసులో మిగతా వాళ్లతో ఎలా పోటీపడుతున్నారు. ఈ ఆరేళ్లలోనే అదెలా సాధ్యమైంది? ఇంత షార్ట్ గ్యాప్‌లో లిబరల్ పార్టీపై ఆమెకు అంత పట్టెలా వచ్చింది? అనితా ఆనంద్ కెనడా ప్రధాని అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? కెనడాకు ప్రధాని ఎవరైనా.. వారికి వచ్చీ రావడంతోనే ఎదురయ్యే సవాళ్లేంటనే ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకుందాం.
ఎవరీ అనితా ఆనంద్?
అనితా ఆనంద్ కెనడాలోని నోవా స్కోటియాలోని కెంట్ విల్లేలో 1967 మే 20న జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. 1960లోనే కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనితా ఆనంద్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుండి బీఏ, పొలిటికల్ సైన్స్ అండ్ లా డిగ్రీలు చేశారు. అలాగే దల్ హౌసీ యూనివర్శిటీ, టొరొంటో యూనివర్శిటీల నుండి అడ్వాన్స్ డ్ లా డిగ్రీలు పూర్తిచేశారు.
అనితా ఆనంద్ చదువులో మేటి. అందుకే ఆమె తొలుత టీచింగ్ ఫీల్డ్ ఎంచుకుని యూనివర్శిటీల్లో విద్యార్థులకు చదువు చెప్పారు. ఫినాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి సబ్జెక్టులపై ఆమెకు బాగా పట్టుంది.
2019 లో కెనడాలో అధికారంలో ఉన్న లిబరల్ పార్టీలో చేరడం ద్వారా ఆమె తొలిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒంటారియోలోని ఓక్ విల్లే నుండి కెనడా పార్లమెంట్‌లో హౌజ్ ఆఫ్ కామన్స్ సభకు ఎన్నికయ్యారు. కెనడాలో హౌజ్ ఆఫ్ కామన్స్ అంటే ఇండియాలో లోక్‌సభకు సమానమన్న మాట.
2019 లో కెనడా పార్లమెంట్‌కు ఎన్నికవడంతోనే లిబరల్ పార్టీ ఆమె గత అనుభవాన్ని చూసి మంత్రి పదవి ఇచ్చింది. దాంతో రాజకీయాల్లోకి వచ్చీ రావడంతోనే కెనడాలో కేంద్ర మంత్రి అయ్యారు. ప్రజా సేవల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే కొవిడ్-19 పెను సవాల్ విసిరింది. అయినప్పటికీ కెనడా వాసులకు కొవిడ్ వ్యాక్సీన్లు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అందేలా చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అది మంత్రిగా ఆమెకు దక్కిన తొలి విజయం.
రక్షణ శాఖ మంత్రిగా కీలక సవాళ్లు ఛేదించిన అనిత
2021 లో కెనడా కేబినెట్‌లో మార్పులు జరిగాయి. ఈసారి అనితా ఆనంద్‌కు కెనడా రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పీక్ స్టేజ్‌లో ఉన్న సమయం అది. కెనడాకు రష్యాతో విబేధాలున్నాయి. అందుకే రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు కెనడా భారీగానే సాయం అందించింది. రక్షణ శాఖ మంత్రిగా ఆ బాధ్యతలు నిర్వర్తించింది అనితా ఆనందే.
అప్పటికే కెనడా రక్షణ శాఖలో అంతర్గతంగా లైంగిక వేధింపుల కేసులతో ఒక సంక్షోభం నడుస్తోంది. కానీ ఆ సవాళ్లను కూడా ఛేదించడంలో అనితా ఆనంద్ సక్సెస్ అయ్యారు. ఇవన్నీ లిబరల్ పార్టీలో ఆమె సక్సెస్ గ్రాఫ్ పెంచుతూ వచ్చాయి.
మూడోసారి కూడా అదరగొట్టిన అనిత
2022 కేబినెట్ రీషఫిల్‌లో అనితా ఆనంద్‌కు రవాణా శాఖ, అంతర్గత వాణిజ్యం శాఖలు అప్పగించారు. కెనడా రవాణా శాఖ మంత్రిగా ఆమె రోడ్లు, రైల్వే నెట్‌వర్క్, రవాణా పరంగా మౌళిక సదుపాయాలను ఆధునీకరించడంపై ఫోకస్ చేశారు. భారతీయ నేపథ్యం ఉన్న మహిళా నాయకురాలు కూడా అవడంతో కెనడా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. క్రమక్రమంగా లిబరల్ పార్టీలో సత్తా ఉన్న లీడర్లలో ఒకరిగా ఎదిగారు. అదే ఇప్పుడామెను కెనడా ప్రధాని రేసులోనూ పేరు వినిపించేలా చేసింది.
అనితకు పోటీగా ఉన్నదెవరు?
అయితే, అనితా ఆనంద్ కెనడా ప్రధాని అవడం అంత ఈజీ విషయమేమీ కాదు. ఎందుకంటే... ఆమెకు మాజీ ఉప ప్రధాని 56 ఏళ్ల క్రిస్టియా ఫ్రీలాండ్ నుండి గట్టిపోటీ ఉంది. క్రిస్టియా మొన్నటి డిసెంబర్ వరకు కెనడా ఉప ప్రధానిగా ఉన్నారు. ట్రూడో విధానాలు నచ్చని వారిలో ఆమె కూడా ఒకరు. ఆ అసంతృప్తితోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. 2015 నుండి అనేక కేబినెట్ పదవుల్లో కొనసాగిన అనుభవం ఆమె సొంతం. అది ఆమెకు ప్లస్ పాయింట్ కూడా.
మార్క్ కేర్నీ
కెనడా ప్రధాని రేసులో నిలిచిన మరో వ్యక్తి 59 ఏళ్ల మార్క్ కేర్నీ. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంస్థలకు గవర్నర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ట్రూడో సర్కారులో స్పెషల్ ఎకనమిక్ అడ్వైజర్‌గా సేవలందిస్తున్నారు. ప్రధాని పదవికి పోటీపడుతున్న వారిలో పాపులారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు.
డామినిక్ లిబ్లాంక్
కెనడా ప్రధాని పదవికి పోటీపడుతున్న మరో సీనియర్ డామినిక్ లిబ్లాంక్. కెనడా రాజకీయాల్లో ట్రూడోకు అత్యంత సన్నిహితుడు. అమెరికా, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను డామినిక్ చూసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా - కెనడా మధ్య వాణిజ్య పరమైన విబేధాలు తలెత్తకుండా ఫ్లోరిడాలో ట్రంప్‌తో రెండుసార్లు సమావేశమయ్యారు.
మెలానీ జోలీ:
45 ఏళ్ల మెలానీ జోలీ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు మెలానీని ట్రూడో స్థానంలో కెనడాకు కాబోయే ప్రధానిగా చూస్తున్నాయి. ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రిగా ఆమెకు ఉండే ప్రత్యేకతలు, క్వాలిఫికేషన్స్ ఆమెకు ఉన్నాయి.
కెనడా కొత్త ప్రధానికి మెయిన్ ఛాలెంజ్ అదే
వీరే కాకుండా అవకాశం ఇస్తే కెనడాను ట్రూడో కంటే బాగా పరిపాలించి చూపిస్తామని లిబరల్ పార్టీకి చెబుతున్న నేతల జాబితా ఇంకా చాలానే ఉంది. వీరిలో లిబరల్ పార్టీ ఎవరికి ఆ అవకాశం ఇస్తుందోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే, కెనడాకు ప్రధానిగా ఎవరు వచ్చినా... వారు కెనడాను పరిపాలించడం కంటే వచ్చే ప్రధాని ఎన్నికల్లో మళ్లీ ఎలా నెగ్గాలా అనేదానిపైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకొన్ని వారాల వ్యవధిలోనే కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓడిపోవద్దనే ఉద్దేశంతోనే లిబరల్ పార్టీ ఇప్పుడు కెనడాలో జస్టిన్ ట్రూడోను గద్దె దించి కొత్త ప్రధానిని అపాయింటే చేసే పనిలో బిజీ అయింది (Challenges ahead for Canada new PM).