Shoji Morimoto: ఏమీ చేయకుండానే ఏడాదికి రూ. 69 లక్షలు సంపాదన.. ఇదో కొత్త ట్రెండ్
Shoji Morimoto rental do-nothing Business Idea: జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి ఏ ఉద్యోగం లేకుండా, ఏమీ చేయకుండానే ఏడాదికి రూ. 69 లక్షలు సంపాదించారు. ఇది ఆయన గతేడాది సంపాదన మాత్రమే. "అరే ఈ ఐడియా ఏదో బాగుందే" .. అయినా ఇంతకీ అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే ఇదిగో ఆ ఇంట్రెస్టింగ్ డీటేల్స్ మీ కోసమే. ఏమీ చేయకుండానే డబ్బులు సంపాదిస్తూన్న ఆ వ్యక్తి పేరు షోజి మొరిమొటో. వయస్సు 41 ఏళ్లు. ఆ డబ్బులు సంపాదించడం కోసం మొరిమొటో ఏ అడ్డదారి తొక్కలేదు... నేరాలు అసలే చేయలేదు. మరి ఏమీ చేయకుండానే అంత డబ్బు ఎలా సంపాదించారనే కదా మీసందేహం!! యస్... అక్కడికే వస్తున్నాం.
షోజి మొరిమొటో రెంటల్- డూ-నథింగ్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే... మొరిమొటోకు తెలియని వాళ్లు, కొత్త వారు ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చు. అంటే, తన సమయాన్ని మరొకరి కోసం వెచ్చించి అందుకు బదులుగా వారి వద్ద నుండి సర్వీస్ చార్జ్ తీసుకుంటారన్నమాట. అలాగని మొరిమొటోను ప్లే బాయ్ అనో లేక మరొకటిగానో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లే ఆయన ఎలాంటి అడ్డదారి తొక్కలేదు. మొరిమొటో తన క్లయింట్స్‌తో ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోరు. 2018 లో మొరిమొటో తన ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాతే ఆయన తెలివిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు.
షోజి మొరిమొటో తనని బుక్ చేసుకున్న క్లయింట్స్ వద్దకు వెళ్తారు. వారితో సరదాగా ముచ్చటించడం, వారితో కలిసి వారి పనులకు వెంట వెళ్లడం చేస్తుంటారు. అంతకు మించి ఆయన ఒక్కపని కూడా చేయరు. స్పష్టంగా చెప్పాలంటే ఒంటరిగా ఉండే వారు లేదా ఎక్కడికైనా వెళ్లాల్సిన పనుల్లో మరొకరి సహాయం అవసరం ఉండే వారే మొరిమొటో సేవలు తీసుకుంటారు. ఎవరైతే తన రెంటల్ సర్వీసెస్ బుక్ చేసుకుంటారో... వారి వద్దకు వెళ్లడం, వారికి కంపెనీగా గడపడం మాత్రమే ఆయన చేసే పని. అంతకు మించి ఒక్క పని కూడా చేయనని ఆయనే చెబుతున్నారు.
ఉదాహరణకు చెప్పాలంటే మారథాన్ రన్నర్‌కు ఫినిషింగ్ లైన్ వద్ద ఉండి వారికి మద్దతుగా నిలవడం, తమ క్లయింట్స్ ఇంట్లో పనులు చేసుకుంటుంటే వారి తరపున వీడియో కాల్స్ అటెండ్ అవడం, ఒక ఫంక్షన్‌కు వెళ్లలేకపోయిన తన క్లయింట్స్ తరపున ఫంక్షన్స్‌కు హాజరవడం లాంటి సేవలు అందిస్తుంటారు. లేదంటే తమ క్లయింట్స్ తరపున లైన్లలో నిలబడటం, ఒంటరిగా ఉన్న వారితో సరదాగా ముచ్చటించడం కూడా మొరిమొటో ఎక్కువగా చేసే పనుల జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పనులు చేసి ఆయన 80 వేల డాలర్లు సంపాదించారు. అవి ఇండియన్ కరెన్సీలో 69 లక్షల రూపాయలతో సమానం.
మొరిమొటోకు ఏడాదికి ఇంచుమించు 1000 బుకింగ్ రిక్వెస్టులు వస్తుంటాయి. అందులో కొన్ని గంటల వ్యవధి కోసం బుక్ చేసుకునే వారు ఉంటే ఇంకొంతమంది తమ అవసరాన్ని, పనినిబట్టి అంతకంటే ఎక్కువే బుక్ చేసుకుంటుంటారు. గతంలో 2-3 గంటల బుకింగ్ కోసం 65 నుండి 95 డాలర్ల వరకు చార్జ్ చేసే వారు. కానీ ఇప్పుడు తన సేవలకు ఎంత ఇవ్వాలనే నిర్ణయాన్ని తమ క్లయింట్స్ కే వదిలేశా అంటున్నారు.
జపాన్ లో ఈ తరహా రెంటల్ బిజినెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. ఫంక్షన్ కు వెళ్లాలన్నా, ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాలన్నా తమకు ఓ తోడు కావాలంటే.. ఇలా తమకు అవసరమైన వారిని బుక్ చేసుకోవచ్చు. గళ్ ఫ్రెండ్ కావాలన్న వారికి గళ్ ఫ్రెండ్ రెడీ... బాయ్ ఫ్రెండ్ కావాలనుకునే వారికి బాయ్ ఫ్రెండ్ రెడీ. ఏ పని కోసమైతే వారిని బుక్ చేసుకున్నారో.. ఆ అవసరం తీరాకా ఎవరి దారి వారు చూసుకుంటారు. వచ్చిన వారు సర్వీస్ చార్జ్ తీసుకుని వెళ్లిపోతారు.
కొద్దిసేపు తనతో మాట్లాడే తోడు ఎవరైనా ఉంటే బాగుండునని కోరుకుంటూ ఒంటరితనంతో బాధపడే వారిని టార్గెట్ చేసుకుని ఈ బిజినెస్ నడుస్తోంది. అయితే, ఎవరినిపడితే వారిని కాసేపు సమయం కేటాయించి తనతో మాట్లాడాల్సిందిగా అడగలేరు కదా!! అందుకే వారు ఇలా డబ్బులు చెల్లించి కొన్ని గంటల కోసం ఒక తోడును బుక్ చేసుకుంటున్నారు. దానినే ఇంగ్లీష్‌లో కంపనీ అనీ... లేదా కంపనీయన్‌షిప్ అని పిలస్తుంటారు. ఇది ఇప్పుడు జపాన్‌లో కనిపిస్తోన్న ట్రెండ్.
షోజి మొరిమొటో (Shoji Morimoto rental do-nothing Business idea) అందిస్తోన్న రెంటల్ సర్వీసెస్ కూడా ఆ కోవలోకి వచ్చేవే. ఏదేమైనా ఏమీ చేయకుండానే తాను డబ్బులు సంపాదిస్తున్నానని చెబుతున్న మొరిమొటో రియల్ స్టోరీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా ఇండియాలోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. కానీ ఒంటరిగా ఉన్న వారిని మోసం చేసేందుకు ఈ ఐడియాను వాడుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే ఇండియాలో కొన్ని కేసులు కూడా తెరపైకొచ్చాయి.