South Korea: అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేశారు. దక్షిణ కొరియాలో యూన్ అభిశంసనను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న మార్షల్ లా డిక్లరేషన్ కు సంబంధించిన కేసుల్లో దక్షిణ కొరియా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. బుధవారం ఉదయం, మూడు వేల మందికి పైగా పోలీసు అధికారులు, అవినీతి నిరోధక పరిశోధకులు యోల్ ఇంటికి చేరుకున్నారు. యూన్ మద్దతుదారులు, అధికార పీపుల్స్ పవర్ పార్టీ సభ్యులు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రతిష్టంభనల మధ్య, యున్ సుక్ యోల్ ను అరెస్టు చేశారు.
అనూహ్యంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి పెను చిక్కులు తెచ్చుకున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. ఇప్పటికే ఆయన అభిశంసన గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు యోల్ ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
బుధవారం తెల్లవారుజామున వందలాది మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. అక్కడ మొదట అధ్యక్ష భద్రతా దళాలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కాసేపు ప్రతిష్ఠంభన వాతావరణం నెలకొంది. తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ ను అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత మధ్య ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. గతంలో యోల్ ను అరెస్టు చేసేందుకు ఓ సారి ప్రయత్నించారు. పెద్దెత్తున ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఆ పరిణామాలను ద్రుష్టిలో ఉంచుకుని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నారు. ఆయన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకువచ్చారు. దీన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు యోల్ కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేశారు. 85 మంది వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు ఎమర్జెన్సీ పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు. అరెస్టు వారెంట్ జారీ అవ్వడంతో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.