Indian Students in US: అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి, మరో ఇద్దరికి గాయాలు
Indian Student Died in US Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాస్టర్స్ చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నిసీ రాష్ట్రంలోని మెంఫిస్ సిటీలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన విద్యార్థినిని గుంటూరుకు చెందిన నాగశ్రీ వందన పరిమళగా అమెరికా పోలీసులు గుర్తించారు. పవన్, నిఖిత్ కు గాయాలు కాగా పవన్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
గుంటూరు జిల్లాకు చెందిన ఒక బిజినెస్‌మేన్ కూతురైన నాగశ్రీ వందన పరిమళ... 2022 లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. మెంఫిస్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేస్తున్నారు. ఆమె వయస్సు 26 ఏళ్లు. శుక్రవారం రాత్రి నాగశ్రీ, పవన్, నిఖిత్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మరో కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురుని అమెరికా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిమళ మృతి చెందారు. పవన్, నిఖిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న మెంఫిస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.