USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..ఓ పాఠశాలలో కాల్పులు..ఐదుగురు దుర్మరణం
USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. విస్కాన్సిన్ లోని మాడిసన్ లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థి ఈ కాల్పుల ఘటనకు కారణమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారు విద్యార్థులా లేదా సిబ్బందా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కాల్పుల ఘటనకు సంబంధించి దేశ అధ్యక్షుడ బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసులు వాహనాలు, అంబులెన్స్ లు, ఫైరింజన్లు పాఠశాలను మోహరించి దర్యాప్తు చేపట్టారు. తాజా ఘటనతో అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ కల్చర్ పై చర్చ సాగింది.
తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రతత అమెరికాలో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఈమధ్య కాలంలో అమెరికాలో పాఠశాలల్లో కాల్పల ఘటనలు భారీగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పుల ఘటనలు జరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.