Trump: త్వరలోనే అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్..భారత్ పట్ల తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి భారత్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్స్ వసూలు చేస్తోందంటూ ఆరోపణలు చేశారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక టారిఫ్ లు విధిస్తున్నాయని..100, 200ల శాతం పన్నులు వేస్తున్నాయని తెలిపారు. దేనికైనా ప్రతిచర్య ఉంటుందని..వాళ్లు మాపై పన్నలు విధిస్తే మేము కూడా అదే స్థాయిలో పన్నలు వసూలు చేస్తామని తెలిపారు. ఒకవేళ భారత్ వంద శాతం పన్నలు విధిస్తే..మేము వారిపై అలాగే ఛార్జ్ వేయకూడదా అని ప్రశ్నించారు. ఆయా దేశాలు సుంకాలు వసూలు చేయడం అనేది వారి ఇష్టమే అయినప్పటికీ మేము కూడా అలాగే స్పందిస్తామని ట్రంప్ అన్నారు.
అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ పలుమార్లు సుంకాల అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.